26 July, 2026 | 1:15 PM

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తాం

27-06-2024 12:23 AM

హైకోర్టుకు నివేదించిన రాష్ట్రం

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): హుజూరాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. పిటిషనర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చెబుతున్నట్లు ఈ నెల 27 తర్వాత చెక్కులు చెల్లకుండాపోయే అవకాశమేదీ లేదని చెప్పింది. చెక్కులు ఆగస్టు వరకు చెల్లుబాటు అవుతాయని అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. ఇప్పటికే 71 మంది లబ్ధిదారుల చెక్కులు బ్యాంకులకు పంపించామన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరి చెక్కులు అందజేస్తామని తెలిపారు. ఈ వివరాలను నమోదు చేసుకున్న హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విచారణను జులై 15కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సూరేపల్లి నందా బుధవారం తెలిపారు. హుజూరాబాద్‌లోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయకుండా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తనను అడ్డుకుంటున్నారని కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతోనే అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. తమకు చెక్కులు అందలేదని ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని, కేవలం రాజకీయం చేయడంలో భాగంగానే ఈ పిటిషన్ దాఖలైందని చెప్పారు.