7 May, 2026 | 1:57 AM

బాధితులకు న్యాయం చేయాలి

07-05-2026 12:46 AM

గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ నేతల పరామర్శ

బాధితులతో కలిసి రాస్తారోకో

మంచిర్యాల, మే 6 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల సమీపాన ఉన్న షెడ్డుల గోడకూలి నలుగురు మృతి చెందిన సంఘటలో బాధితులకు న్యాయం చేయాలంటూ బీఆర్‌ఎస్ డిమాండ్‌ చేసింది. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎంఎల్‌ఏ నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు లు ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ధర్నాకి దిగారు. రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల పరిహారం అందజేసి న్యాయం చేయాలం టూ బుధ వారం ఉదయం సుమారు 11 గంటలకు ప్రారంభించిన రాస్తారోకో సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా కొనసాగించారు. దాదాపు ఆరు గంటలకుపైగా రాస్తారోకో నిర్వహించడంతో అటు జగిత్యాల జిల్లా రాయపట్నం దాటి, ఆదిలాబాద్ వైపు దాదాపు ఎల్లారం వరకు, ఇటు మంచిర్యాల వైపు దొనబండ వరకు వాహనాలు నిలిచిపోయాయి. మంచిర్యాల నుంచి జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు కార్లలో, ఆటోలలో హాజీపూర్ మండలం గుడిపేట ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదుగా ప్రయాణించారు. ధర్నాను విరమింపజేసేందుకు దాదాపు 500 మంది బెటాలియన్ పోలీసులు చేరుకున్నారు.