19 July, 2026 | 4:41 AM

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్

19-07-2026 01:02 AM
  1. మాజీ మంత్రి సబితారెడ్డి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్పీ గృహ నిర్బంధం
  2. అడ్డుకుంటే ఆమరణ దీక్ష  చేస్తానన్న ప్రవీణ్‌కుమార్ 

హైదరాబాద్/ఎల్బీనగర్, జూలై 18 (విజయక్రాంతి) : సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి సబితారెడ్డిని హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఆయన ఇంట్లో నిర్బంధించారు. సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ తమను నిర్బంధించడంపై బీఆర్‌ఎస్ నేతలు  ఆగ్ర హం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ నిరుద్యోగ యువత తరఫున తమ గళం వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్బంధాలు మానుకొని, ఇచ్చిన హామీల మేరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా సబితారెడ్డిని విడుదల చేయగా ఆమె సదస్సుకు హాజరయ్యారు. తనను అడ్డుకోవడంపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ వీడి యో సందేశం ద్వారా స్పందించారు. మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని, మిమ్ములను ఎక్కడ పోనివ్వకూడదని పోలీసులు అంటున్నారని ప్రవీణ్‌కుమార్ చెప్పారు.

ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తున్నదని, మళ్లీ సిగ్గు లేకుండా ప్రజా పాలన అంటున్నారని దుయ్యబట్టారు. హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొదటి నుంచీ మా సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారని మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా నేను మా సభకు వెళ్తానని ఒకవేళ పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు.