19 July, 2026 | 3:48 AM

హైడ్రా మెగా ఆపరేషన్

19-07-2026 12:57 AM

30 వేల కోట్ల విలువైన 840 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం!

హైదరాబాద్ చుట్టూ ఏకకాలంలో దాడులు

పోలీసు బందోబస్తు మధ్య ప్రత్యేక డ్రైవ్

భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు

రంగారెడ్డి, జూలై 18 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం చుట్టుపక్కల భూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ హైడ్రా మరోసారి ఉక్కుపాదం మోపింది. శనివారం నగరం నలువైపులా ఏకకాలంలో భారీ ఆపరేషన్లు నిర్వహించిన హైడ్రా అధికారులు, ఒకే రోజు ఏకంగా 840 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడారు.

బహిరంగ మార్కెట్ లో ఈ భూముల విలువ రూ.30 వేల కోట్ల కు పైగా ఉంటుందని ప్రాథమిక అంచనా. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల - మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి వచ్చి న ప్రత్యేక విజ్ఞప్తుల మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ మెగా డ్రైవ్‌ను నిర్వహించి, ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

శంషాబాద్‌లో 650 ఎకరాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో హైడ్రా అతిపెద్ద ఆపరేషన్ చేపట్టింది. 1954 ఖాస్రా పహాణీ ప్రకారం సర్వే నంబర్లు 25, 26లలో ఉన్న 650 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వ భూ మిగా నమోదై ఉంది. అయితే, ఈ విలువైన భూములను కాజేసే క్రమంలో పలువురు బడాబాబులు ఇక్కడ అక్రమంగా ఫామ్ హౌస్‌లను నిర్మించారు.

మరికొందరు ప్రైవే టు వ్యక్తులు ఏకంగా ప్రభుత్వ భూమిలోనే వ్యవసాయం సాగిస్తున్నారు. శంషాబాద్ మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో హైడ్రా బలగాలు రంగంలోకి దిగి, ఆక్రమణలను అడ్డుకుంటూ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నాయి.

రాయదుర్గంలో 84 ఎకరాలు

రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత ఖరీదైన ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో హైడ్రా గట్టి దెబ్బకొట్టింది. రాయదుర్గం గ్రామంలోని సర్వే నంబరు 46లో ఉన్న 84 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ ప్రభుత్వ భూమికి పక్కనే ఉన్న అర ఎకరం పట్టా భూమిని ఆసరాగా చేసుకుని, కొందరు కేటుగాళ్లు ప్రభుత్వ భూమిలోకి చొరబడ్డారు. ఆ భూమిని గజాల చొప్పున విభజించి అక్రమంగా విక్రయాలు జరుపుతున్న వారిపై అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

కంటోన్మెంట్ పరిధిలో 106 ఎకరాలకు ఫెన్సింగ్

మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న జీఎల్‌ఆర్ (జనరల్ ల్యాండ్ రిజిస్టర్) నంబరు 243, 255లలోని 106 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కొండలను అక్రమంగా పేల్చుతూ మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తూ, స్థానికంగా ఉండే నెమళ్లు, ఇతర వన్యప్రాణుల సంచారానికి తీవ్ర ఆటంకం కల్పిస్తూ ఆక్రమణలు జరుగుతున్నట్లు అధికారులు కనుగొన్నారు. పర్యావ రణానికి ముప్పు తెస్తూ, కొందరు అక్రమంగా లేఅవుట్లు కూడా వేసినట్లు రెవెన్యూ, హైడ్రా అధికారులు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదులు, రెవెన్యూ అధికారుల నివేదికల ఆధారంగా ఇక్కడ ఫెన్సింగ్ వేసి వన్యప్రాణుల సంరక్షణకు, ప్రభుత్వ భూమి రక్షణకు చర్యలు తీసుకున్నారు.