బీఆర్‌ఎస్ నేతల రాస్తారోకో
కేటీఆర్ పిలుపుతో ఆందోళన నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎల్లారెడ్డిపేట,సెప్టెంబర్ 2(విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడాన్ని, చంద్రబాబు సూచనతో గోదావరి జలాలను బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రకు తరలించే కుట్రను నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనల భాగంగా, ఎల్లారెడ్డిపేట మండలంలో బీఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు.
మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు భారీగా చేరి నిరసన తెలిపారు. అనంతరం సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ రూటులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ఎల్లారెడ్డిపేట ఎస్‌ఐ రాహుల్ రెడ్డి కానిస్టేబుళ్లతో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. ధర్నా విరమించాలని కోరినప్పటికీ నాయకులు అంగీకరించకపోవడంతో, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణ హరి, సీనియర్ నాయకులు సుభాష్, రమేష్ గౌడ్,వెంకట నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎడ్ల సందీప్, మాజీ ఎంపీటీసీ పందిర్ల నాగరాణి పరశురాములు,గుండాడి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






