అసెంబ్లీలో బీఆర్ఎస్ నిరసన.. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పిస్తున్నారంటూ నినాదాలు
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు(Telangana Budget session) ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla) ప్రసంగించారు. బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలుపుతున్నారు. తమ స్థానాల్లో నిలబడి నిరసన చేపట్టారు. గవర్నర్ తో అబద్ధాలు చెప్పిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనల నడమ గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు హామీలకు నిధులు కేటాయించాలని, చట్టబద్ధమైన మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం గన్ పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నిరసన చేపట్టారు. రైతులకు రైతు బంధు సహాయం ఆలస్యం కావడం, పెరుగుతున్న అవినీతి వంటి రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యలను లేవనెత్తుతామని బీఆర్ఎస్ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.




