మంత్రి వివేక్ వ్యాఖ్యలను ఖండించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
సంగారెడ్డి, జూన్ 9 : కొనుగోలు కేంద్రాల్లో ప్రతిపక్షాలు తమాషా చేస్తున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు... సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తవుతున్నా ప్రజలకు ఏ అభివృద్ధి చేశారో చెప్పాల్సింది పోయి, ప్రజల సమస్యలను ప్రస్తావిస్తున్న ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రజల పక్షాన మాట్లాడటం ప్రతిపక్షాల బాధ్యత అని, దానిని తమాషాగా అభివర్ణించడం సరైంది కాదని పేర్కొన్నారు.
జిల్లా సమీక్ష సమావేశానికి వచ్చిన మంత్రి జిల్లా అభివృద్ధి, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాల్సింది పోయి రాష్ట్రవ్యాప్త అంశాలను ప్రస్తావించడం భావ్యం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలయాపన చేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వినతిపత్రం సమర్పించారు.






