అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన
- గవర్నర్ ప్రసంగం పూర్తయ్యే వరకూ నిలబడి ఆందోళన
- వందేమాతరం గీతాలాపన సమయంలో ఎంఐఎం వాకౌట్
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 16(విజయక్రాంతి): శాసనసభలో మొదటి రోజు బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగం పూర్తయ్యే వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అసెంబ్లీలో వందేమాతరం గీతాలాపనను నిరసిస్తూ ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సభలో వందేమాతరం గీతాలాపన చేశారు.
అయితే దీనిపై ఎంఐంఎ సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ నిరసన వ్యక్తం చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేశారు. గీతాలాపన ముగిసే వరకు వారు సభలోకి అడుగుపెట్టలేదు. అయితే గతంలోనూ వందేమాతరం గీతాలాపన సందర్భాల్లో ఎంఐఎం సభ్యులు ఇదే తరహాలో వ్యవహరించిన ఘటనలు ఉన్నాయి. తాజాగా బడ్జెట్ సమావేశాల తొలిరోజే ఈ పరిణామం చోటు చేసుకోవడంతో చర్చనీ యాంశంగా మారింది.




