కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..
రూ. లక్ష కోట్లు నదిలో కొట్టుకుపోయాయి
తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అనేక సార్లు అన్నారు.
ప్రాంతాలుగా వేరవుదాం.. అన్నదమ్ముల్లా కలిసుందాం
న్యూఢిల్లీ: కేసీఆర్ చేసిన ఎంతో పోరాటం వల్ల తెలంగాణ సాకారమైందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి(BRS MP KR Suresh Reddy) అన్నారు. ప్రాంతాలుగా వేరవుదాం.. అన్నదమ్ముల్లా కలిసుందామని కేసీఆర్ అన్న విషయాన్ని రాజ్యసభలో ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తీరుపై బీజేపీ తరుచు విమర్శలు చేస్తోందన్నారు. తల్లిని చంపి బిడ్డను తీశారన్నట్లుగా పార్లమెంటులోనూ చెప్పారని పేర్కొన్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన సమయమిదన్నారు. అమరావతికి కేసీఆర్ మద్దతు తెలిపారని వెల్లడించారు. అమరుల త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నామం.. దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టమన్నారు.
తెలంగాణ అనుమతి లేకుండానే కొన్ని మండలాలను ఏపీలో కలిపారని సురేశ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ మండలాలను ఏపీలో విలీనం చేసేటప్పుడు కనీసం చర్చ కూడా జరగలేదని విమర్శించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అనేకసార్లు అన్నారని, ఏపీ విభజన బిల్లును ఏపీ పునర్నిర్మాణ బిల్లుగా చేయొద్దని సురేశ్ రెడ్డి పేర్కొన్నారు. 12 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం ఎలాంటి సహాయం చేయట్లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం సహకరించుకున్నా... తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. ఇవాళ దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. కాళేశ్వరం గురించి కేంద్రమంత్రి ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రూ. లక్ష కోట్లు నదిలో కొట్టుకుపోయాయి అని కేంద్రమంత్రి మాట్లాడారని సురేశ్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక్క డ్యామ్ మాత్రమే కాదన్న సురేశ్ రెడ్డి వెల్లడించారు.




