01-02-2026 05:47:08 PM
సబ్ డివిజన్ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం
మణుగూరులో స్వల్ప ఉద్రిక్తత
కేసీఆర్ జోలికొస్తే, అగ్గిపుట్టిస్తాం
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు,(విజయక్రాంతి): రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యమైన ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ప్రతిపక్ష నేత కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ సబ్ డివిజన్ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఆ పార్టీ శ్రేణులు నల్లజెండాలు, బ్యాడ్జీలను దరించి బైక్ ర్యాలీలతో, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కెసిఆర్ కు సిట్ విచారణ పై గులాబీ శ్రేణులు నిరసనలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుడ్లెర్ర జేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సిట్ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలుచోట్ల సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాలలో ముందు వరుసలో నిలబెట్టిన కేసీఆర్ ఫై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన రహదారిపై భారీ బైక్ ర్యాలీ నిర్వ హించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ కూడలికి చేరుకొని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాంతరావు మాట్లాడుతూ... తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసుల పేరు తో ఇబ్బందులు పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతుందని మండిపడ్డారు. అక్రమ కేసులతో అణచివేయాలని చూస్తే ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ ఎమ్మెల్యే రేగా హెచ్చరించారు.
సిట్ నోటీసులకు సరైన సమాధానం చెప్తామని స్వచ్ఛంగా అధినేత బయటికి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి పోశం నరసింహా రావు, నాయ కులు యాదగిరి గౌడ్, వల్లభనేని రమణ, కుంటా లక్ష్మణ్, బోసెట్టి రవి కుమార్, వీర పనేని చిన్నకేశవులు, ఎడ్ల శ్రీనివాస్,రామ కోటి, ముద్ధంగల కృష్ణ,వేంకట సోములు, జావిద్ పాషా, వెంకటయ్య, వీరన్నబాబు, అప్పారావు, వావిలాల నరసయ్య, శ్రీని వాస్, మహిళా నాయకులు, అనుబంద సంఘాల బాధ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నా రు.