కేసీఆర్ కృషి ఫలితమే కాళేశ్వరం: మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి: రైతుల కన్నీళ్లు తుడిచేందుకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భాగీరథ కృషి ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంపైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డితో కలిసి నల్ల బ్యాడ్జ్ లు ధరించి రాస్తా రోకోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీడు భూముల్లో నీళ్లు పారించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దిన అపర భగీరదుడు కేసీఆర్ పై సీబీఐ కేసులా..? సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో 60 ఏళ్లపాటు తెలంగాణ రైతులు, రైతు కూలీలు పడిన బాధలు వర్ణనాతీతమని గుర్తుచేశారు. స్వరాష్ట్రం వచ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో చేసిన సంస్కరణలతో తెలంగాణ, దేశానికి అన్నపూర్ణగా నిలిచిందని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం కోసం కేసీఆర్ రేయింబవాళ్లు శ్రమించారని, దీని వలన లక్షలాది రైతులకు నీరు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేసీఆర్‌ను బద్నాం చేయడానికి కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ కక్కుతున్న విషాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.






