బీఆర్‌ఎస్‌ది ఓర్వలేని తనం
- తెలంగాణ ప్రజలకు బీమా సౌకర్యం కల్పించడం నేరమా?
- నేను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడే అవకాశమివ్వలేదు
- ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతులను చించివేసి బయటికి వెళ్లారు
- బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే లక్ష్యం గా పరిపాలన అందిస్తుంటే బీఆర్‌ఎస్ ఓర్చుకోవడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి బీఆర్‌ఎస్ నేతలకు ఇష్టం లేదని మండిపడ్డారు.
బడ్జెట్‌లో మేం ఏ తప్పు చేశామని, విద్యార్థులకు ఉదయం అల్పాహారం ఇవ్వడం కూడా ఓర్చుకోలేకపోతే ఎలా?, తెలంగాణ ప్రజలకు బీమా సౌకర్యం కల్పించడం నేరమా? అని నిలదీశారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తూ మేము పాలకులం కాదు, ప్రజలకు సేవకులం.
ప్రజలు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజా సంక్షేమం, అభివృద్ధేధ్యేయంగా రాష్ట్రా న్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నామన్నారు. ప్రజల అవసరాలు తీర్చేందుకే సభ కు వచ్చామన్నారు. సంక్షేమ పథకాల అమ లు గురించి చెబుతుంటే వినడానికి బీఆర్‌ఎస్‌కు సమయం లేదా? అని నిలదీశారు.
బీమా సౌకర్యం కల్పించడం ఇష్టం లేదు
‘ప్రభుత్వ ఉద్యోగ కుటుంబ పెద్ద మరణిస్తే.. ఆ కుటుంబం పరిస్థితి తలకిందులై పోతుంది. అలాంటి కుటుంబాలకు ఆర్థిక సమస్య ఉండొద్దని బీమా సౌకర్యం కల్పిం చాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా 1.20 కోట్ల ప్రమాద బీమాను కల్పించాం. ఉద్యోగులకు క్యాష్‌లెస్ వైద్యం సౌకర్యం కల్పిస్తు న్నాం’ అని తెలిపారు. ‘గతంలోనే నేను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు, గౌరవించలేదు.
అయి నా ఆర్థరాత్రి వరకు ఓపికగా ఉన్నామే తప్ప వాకౌట్ చేయలేదు, వెల్‌లోకి వెళ్లలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో బడ్జెట్ ప్రవేశపెడితే.. బడ్జెట్ పత్రాలు చించి చెవిలో పెట్టుకుని సభ నుంచి వెళ్లిపోయారు. ఇది ప్రజాస్వామ్యంపై వారికున్న గౌరవం. ప్రతిప్రశ్నకు క్లారిఫికేషన్ ఇస్తామన్నాం. ప్రతిపక్ష నేత సభకు రారు.. కానీ ఆ పార్టీ సభ్యులకు కూడా వినే ఓకికలేకుండా వెళ్లిపోయారు.
బీఆర్‌ఎస్ సభ్యులు చెప్పింది మేం వినాలి.. వినకపోతే వెళ్లిపోతామంటున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని చులకనగా చూడ కండి’ అని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌కు మాట్లాడాటానికి ఏమీ లేదని, ఆడలేక మధ్య లో ఓడు అన్నట్టు సభ నుంచి సిగ్గులేకుండా వెళ్లిపోయారని మడిపడ్డారు. బీఆర్ ఎస్ నేతల అహంకారాన్ని ప్రజలు జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేరని భట్టి హెచ్చరించారు.
విద్యార్థులకు భోజనం పెట్టడం ఇష్టం లేదు!
‘లక్షలాదిమంది పేద విద్యార్థుల ఆకలిని అర్థం చేసుకున్న వ్యక్తులుగా విద్యార్థులు ఖాళీ కడుపుతో బడికి పోవద్దన్న ఆలోచనతో అల్పాహారం ప్రవేశపెట్టాం. ఆరు రోజుల్లో మూడు రోజులు పాలు, మిగిలిన మూడు రోజులు రాగి జావా ఇవ్వాలని నిర్ణయిం చాం. ఇంటర్ పిల్లలకు మొట్టమొదటి సారి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయబోతున్నాం. కానీ, బీఆర్‌ఎస్‌కు విద్యార్థులకు భోజనం పెట్టడం ఇష్టం లేదు. మీ పదేళ్ల పాలనలో ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టారు.
బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగులు భయం భయంగా బతికా రు’ అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లాగా అమలుకానీ హామీలు ఇచ్చుకుంటే పోతే బడ్జెట్ ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టాల్సి వచ్చేదన్నారు. రైతు భరోసా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సన్నధాన్యం క్వింటాకు రూ.500 బోనస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మి పథకాల కోసం రూ.50 వేల కోట్లు కేటాయించాం.
రైతు భరోసా స్కీమును ఎలక్షన్స్ స్కీముగా మార్చుకున్నది బీఆర్‌ఎస్. 2018 ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు రైతు భరోసా డబ్బులు వేశారు’ అని తెలిపారు. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ కోసం రూ.20,600 కోట్లు చెల్లించాం. ఇందిరమ్మ రాజ్యంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం.
ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రుణాలు ఇస్తామని చెప్పాము. వ్యవసాయానికి సంబంధిం చి పాలిహౌస్ డ్రిప్, బిందు సేద్యం వ్యవసాయాంత్రికరణ పరికరాలు . యువత, శిశు మహిళ సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్ర భుత్వం నుంచి 40శాతం నిధులు కేటాయిం చి సెంటర్ నుంచి రావలసిన 60 శాతం నిధులు తీసుకువస్తాం’ అని వివరించారు.
బిల్లులు పెండింగ్‌లో పెడితే.. క్లియర్ చేస్తున్నాం
‘పదేళ్లు అధికారంలో ఉండి కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు బిల్లులు చెల్లించకుండా రూ.4,600 కోట్ల బకాయిలు పెట్టి పోయారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అడిషనల్‌గా ఇప్పటి వరకు రూ.6 వేల నుంచి రూ.6,500 కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేశాం. ఉద్యోగస్తులతో చర్చించి ప్రతినెలా రూ.700 కోట్లు పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని చెప్పి రూ.730 కోట్ల రూపాయల వరకు ప్రతినెల క్లియర్ చేస్తున్నాం.
ప్రతి నెల రూ.వెయ్యి కోట్లు పెండింగ్ బిల్లును ఉద్యోగులకు ఇస్తామని ఈ బడ్జెట్‌లో పెడితే అది కూడా వినడానికి ప్రతిపక్షానికి ఓపిక లేకపోతే ఎలా’ అని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘గత బడ్జెట్‌లో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ. 22,500 కోట్లు రూపాయలు మంజూరు చేశాం. అయితే ఇండ్ల నిర్మాణం వడివడిగా జరగకపోవడంతో రూ.5,500 కోట్లు మాత్రమే లబ్ధిదారులు బిల్లులు డ్రా చేశారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసాం. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు కుటుంబం లాగా కలిసిమెలిసి చిన్నప్పటినుంచి ఐక్య ముఖ్యంగా విద్యాబుద్ధులు నేర్చుకోవాలని రూ. 200 కోట్లతో ప్రారంభించాం. ఈసారి ప్రతి అసెంబ్లీ నియోజ కవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా మంజూరు చేశాం.
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి స్కిల్ యూనివర్సిటీతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటుతో పాటు విద్యార్థులకు రూ.2 వేల స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టాం. రాష్ట్ర జీడీపీ కూడా పెరుగుతోంది’ అని భట్టి విక్రమార్క వివరించారు.
అప్పులతో ప్రజలపై మోయలేని భారం
గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసి ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని, ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండగా మారాయని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.7 కోట్ల అప్పు చెల్లించాల్సి ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 66,545 కోట్లు అసలు, వడ్డీ చెల్లించాల్సిన దుస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చాక 2023--24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,357 కోట్లు, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.56,968 కోట్లు అప్పు తీసుకురాగా అందులో గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.66,545 కోట్ల అప్పు, మిత్తి చెల్లించామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.86,500 కోట్లు అప్పులు తీసుకురాగా రూ.93,194 కోట్ల అసలు, వడ్డీ అప్పు చెల్లించామన్నారు. ఈ రెండేళ్లలో రూ.1,59,165 కోట్ల అప్పులు తీసుకురాగా గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీ మొత్తంగా 1,85,090 కోట్ల చెల్లించామన్నారు.




