ఖరీఫ్‌కు ఖమ్మం సన్నద్ధం
ఖమ్మం, మే 29 (విజయక్రాంతి): జిల్లా లో ఏటా వ్యవసాయ రంగం వృద్ధి చెందుతోంది. ఈ సారి 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 4.5లక్షల ఎకరాల్లో వరి వేసే అవకాశాలు ఉన్నాయి. పత్తి, మిర్చికి రైతులు మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు అపరాలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఖరీఫ్ ప్రారంభం కానున్న నేప థ్యంలో వలస కూలీలు జిల్లాకు చేరుకుంటున్నారు. దాదాపు 20వేల మంది ఇతర రాష్ట్రాలవారు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నట్లు పేర్కొంటున్నారు.
ముమ్మరంగా పూడిక తీత..
జిల్లాలో 1,268 చెరువులు, చెక్‌డ్యాంలు పంటలకు నీరందిస్తు న్నాయి. ఖరీఫ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చెరువులు, చెక్‌డ్యాంల పరిస్థితులపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. పలు చెరువులు, చెక్ డ్యాంల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఉపాధి కూలీలతో పనులు సాగు తున్నాయి. కామేపల్లి మండలం బర్లగూడెం చెరువు పూడికతీత పనుల్లో గ్రామస్తులంతా పాల్గొనడం గమనార్హం. ఇక ఉమ్మడి జిల్లాలో పాయాయిల్, జామాయిల్ తోటల పెంపకంపై రైతులు ఇటీవల కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు.
చెరువులు, పాలేరు నీటిపైనే ఆధారం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెరువుల కింద 2,30,623 ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్ ఆయకట్టు కింద మరో 2.54 లక్షల ఎకరాలకు పాలేరు ప్రాణం పోయనుంది. ఇక ఇప్పటి వరకు కురిసిన ఒకటి, రెండు వర్షాలకు రైతులు సాగుబడికి సిద్ధమవుతున్నారు. రోహిణి కార్తెలోనే పంటలు సాగు చేసేందుకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులు దుక్కులు దున్ని రెడీగా ఉన్నారు. పెద్ద ఎత్తున మెట్ట పంటల వైపు రైతులు మొగ్గు చూపునున్నారు.






