7 August, 2026 | 9:12 PM

రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఏమైంది..? కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

20-06-2024 05:01 PM

హైదరాబాద్: సింగరేణిని కాపాడేందుకు కేసీఆర్ బొగ్గు గనుల వేలంలో పాల్గొనలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 16 ఎంపీ సీట్ల వచ్చిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందన్నారు. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. 

2021 డిసెంబర్ 11న సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించండని పీసీసీ అధ్యక్షుడిగా ప్రధాని మోడీకి లేఖ రాసి డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఏమైంది.? ఎందుకు ఇవాళ సీఎంగా ఆ వేలం పాటలో తాము పాల్గొంటామనే మాట చెప్తున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారుబీఆర్ఎస్ రక్షణ కవచమని తాను ఊరికే అనడం లేదు.. తొమ్మిదున్నర ఏళ్లలో కేంద్రప్రభుత్వం తమ మెడ మీద కత్తి పెట్టినా కూడా బొగ్గు గనులు వేలం వెయ్యకుండా కాపాడామని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఒడిశాలో రెండు గనులను వేలం లేకుండా నైవేలీ లిగ్నెట్ కు అప్పగించారు. గుజరాత్ లోనూ గనులను వేలం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించారని ఆరోపించారు. తమిళనాడులోనూ ప్రభుత్వరంగ సంస్థకు బొగ్గు గనులు వేలం లేకుండా ఇచ్చారని చెప్పారు. అదానీకి బైలదిల్లా గని కేటాయించడం వల్ల విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లింది.. నష్టాల్లోకి వెళ్లింది కాబట్టి విశాఖ ఉక్కు అమ్ముతున్నామని కేంద్రం చెప్పిందని కేటీఆర్ తెలిపారు. సింగరేణి ప్రైవేటుపరం చేసేందుకు వేలంలో పాల్గొనాలని చెబుతున్నారు. బొగ్గు గనులు కేటాయించకపోతే సింగరేణి నష్టాల్లోకి వెళ్తుందన్నారు. సింగరేణిని ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.