బీఆర్‌ఎస్‌ది అసమర్థ పాలన
- డిప్యూటీ సీఎం భట్టి
సీతారామ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 13 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ఉన్న సీతారామ హెడ్ రెగ్యులేటరీ పనులను పరిశీలించిన అనంతరం ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద నీటిపారుదల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమీక్ష జరిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు.
అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. కొత్తగూడెం, భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరు ఇవ్వడానికి నీటిపారుదలశాఖ ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు పోతున్నామన్నారు. ఈ సమీక్షలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మేల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ భద్రాచలం వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌ఈ కొత్తగూడెం ఎస్.శ్రీనివాసరెడ్డి, ఈఈ సురేష్‌కుమార్ పాల్గొన్నారు.






