22A భూములపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
- నిషేధిత భూములపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
- 22ఏ అమలుపై అధికారులకు మంత్రి పొంగులేటి హెచ్చరికలు
- ప్రజలను ఇబ్బంది పెడితే సహించం
- ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవద్దు
- న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములు కాపాడాలని సూచన
హైదరాబాద్: నిషేధిత భూముల(Prohibited Lands) అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) సోమవారంనాడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ కీలక సమావేశానికి రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి(Medchal-Malkajgiri) జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు హాజరయ్యారు. ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులపై మంత్రి పొంగులేటి ఆరా తీశారు. 22 ఏ అమలుపై అధికారులను మంత్రి పొంగులేటి హెచ్చరించారు. 22ఏను భూతంగా చూపించి ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని సూచించిన మంత్రి జాప్యం చేయకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములు కాపాడాలని పిలుపునిచ్చారు. 22-ఏలో భూమి ఉందనే ఒక్క కారణంతో ప్రజలను తిరస్కరించొద్దని తెలిపారు. భూమి నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చిందో పరిశీలించాలన్నారు. సంబంధిత రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి సూచించారు.






