17 August, 2026 | 4:11 PM

అటవీ భూములపై పరిశ్రమల పంజా..!

17-08-2026 03:35 PM

నాగార్జున సిమెంట్ భూవినియోగంపై అటవీ శాఖ తాజా ఉత్తర్వులు

రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో ఉన్న కట్టడాలు కూల్చివేత 

మఠంపల్లి ఆగస్టు 17 (విజయక్రాంతి): పరిశ్రమల అభివృద్ధి ఒకవైపు అటవీ భూముల పరిరక్షణ మరోవైపు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామ పరిధిలో నాగార్జున సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన భూవినియోగ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పరిశ్రమ పరిధిలోని భూములపై జిల్లా అటవీ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు సంచలనం రేపుతున్నాయి. అటవీ శాఖ రికార్డుల ఆధారంగా సర్వే నంబర్ 88లోని 12 ఎకరాల 6 గుంటల భూమి సుల్తాన్ పురం రిజర్వ్ అటవీ ప్రాంతానికి చెందినదిగా గుర్తించినట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో సదరు భూమి వినియోగం, అక్కడ చేపట్టిన నిర్మాణాలు, వాటికి సంబంధించిన అనుమతులపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల పరిశీలనలో సదరు భూమిలో పరిశ్రమకు సంబంధించిన పలు నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

ఇందులో సెక్యూరిటీ గది, పంప్ హౌస్, తాగునీటి కేంద్రం, కార్మికుల షెడ్లు,ఆటస్థలం, ప్రహరీ గోడ,ముళ్ల కంచె, సిమెంట్ రోడ్డు తదితర నిర్మాణాలు ఉన్నట్లు పేర్కొన్నారు.రిజర్వ్ అటవీ భూమిగా నమోదైన ప్రాంతంలో ఈ నిర్మాణాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? వాటికి సంబంధించి అనుమతులు ఉన్నాయా? భూమి వినియోగానికి ఎవరు అనుమతులు ఇచ్చారు? అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అటవీ శాఖ ఉత్తర్వులతో ఆసక్తికర పరిణామం పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు పర్యావరణం, అటవీ సంపద పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో అటవీ శాఖ తాజా ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ భూముల పరిరక్షణలో భాగంగా అధికారులు తీసుకోబోయే తదుపరి చర్యలపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సర్వే నంబర్ 88లోని భూమికి సంబంధించిన పాత రికార్డులు, ప్రస్తుత భూవినియోగం, నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిగితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమల అభివృద్ధికి అటవీ భూముల వినియోగం ఎంతవరకు సమంజసం? నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా? అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నదే ఇప్పుడు మఠంపల్లి ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.