రిలయన్స్, ఇన్ఫోసిస్‌ల్లో కొనుగోళ్లు
268 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై, మే 22: దిగ్గజ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌ల్లో భారీ కొనుగోళ్లు జరగడంతో బుధవారం స్టాక్ సూచీలు లాభాలతో ముగిసాయి. ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉన్నా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నా దేశీయ సంస్థలు ఎంపికచేసిన కొనుగోళ్లు జరపడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 268 పాయింట్ల లాభంతో 74,221 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 354 పాయింట్లు పెరిగి 74,307 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 22,598 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ వరుసగా ఐదో రోజూ పెరిగిందని, ఏప్రిల్ 25 తర్వాత ఎక్కువరోజులు నిఫ్టీ ర్యాలీ జరపడం ఇదే ప్రధమమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసాని చెప్పారు.
ఎఫ్‌ఎంసీజీపై పెరిగిన ఆసక్తి
యూఎస్ ఫెడ్ మినిట్స్ వెలువడనున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్లు మిశ్రమంగా ఉన్నా, భారత్ సూచీలు పాజిటివ్ ట్రెండ్‌ను ప్రదర్శించాయని, ఇటీవల ఒడిదుడుకులకు గురిచేసిన ఎలక్షన్ టెన్షన్ ఇన్వెస్టర్లలో తగ్గిందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. రుతుపవనాలు దేశంలో త్వరితంగా ప్రవేశిస్తాయన్న వార్తలతో ఎఫ్‌ఎంసీజీ రంగంపై ఆసక్తి పెరిగిందని, అయితే ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు మార్కెట్లలో మళ్లీ ఒడిదుడుకులు ఏర్పడతాయని హెచ్చరించారు.
హెచ్‌యూఎల్ టాప్
చాలా రోజుల తర్వాత ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం బుధవారం జోరు చూపించింది. సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా 2.8 శాతం పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్‌లు 2 శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్లు 2 శాతం వరకూ నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా రియాల్టీ ఇండెక్స్ 1.41 శాతం పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 1.26 శాతం, ఐటీ ఇండెక్స్ 0.63 శాతం, యుటిలిటీస్ సూచి 0.59 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.58 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.35 శాతం చొప్పున పెరిగాయి.కమోడిటీస్, మెటల్ , ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకెక్స్ సూచీలు తగ్గాయి. స్మాల్ క్యాప్ సూచి 0.18 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం క్షీణించింది.
ఎఫ్‌పీఐల అమ్మకాలు యథాతథం
స్టాక్ సూచీల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు బుధవారం సైతం కొనసాగాయి. మంగళవారం రూ. 1,875 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించిన ఎఫ్‌పీఐలు తాజాగా రూ. 687 కోట్లు వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 30,000 కోట్లకుపైగా విలువైన షేర్లను ఎఫ్‌పీఐలు నికరంగా విక్రయించారు.
ముగింపులో 5 ట్రిలియన్ డాలర్లు
మంగళవారం ఇంట్రాడేలో 5 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను తాకిన మార్కెట్ విలువ బుధవారం ట్రేడింగ్ ముగింపులో ఆ స్థాయిని తొలిసారి అందుకున్నది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,15,94,033.72 కోట్ల వద్ద (5 ట్రిలియన్ డాలర్లు) నిలిచింది. మంగళవారం మార్కెట్ ముగింపులో ఈ విలువ రూ.4,14,62,306.56 కోట్లు (4.97 ట్రిలియన్ డాలర్లు). ఇన్వెస్టర్ల సంపద పెరగడం వరుసగా ఇది తొమ్మిదవ రోజు. బుధవారం ఈ సంపద రూ.22.59 లక్షల కోట్లు పెరిగింది. కేవలం ఆరు నెలల్లోపే ౧ట్రిలియన్ డాలర్ల సంపద ఎగిసింది.






