బంగారం, వెండి ప్రభావం.. 50% పెరిగిన కంచిపట్టు ధరలు
ముంబై, మే 22: పెండ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు కంచి పట్టు చీరల కొనుగోళ్లకు వస్త్ర షోరూమ్‌ల్లో కుటుంబాలు కిటకిటలాడతాయి. అలాంటిది ఇప్పుడు వాటి ధర ఆకాశాన్నంటడంతో కొనేందుకు వెనుకంజ వేసే పరిస్థితి. గత ఎనిమిది నెలల్లో కంచి పట్టు చీరల ధరలు 50 శాతం పెరిగాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ పెండ్లిళ్ల సీజన్‌లో వాటి అమ్మకాలు 20 శాతం మేర తగ్గాయని కాంచీపురం పట్టు చీరల్లో నైపుణ్యం గల ఒక ప్రముఖ రిటైల్ టెక్స్‌టైల్ చైన్ అధిపతి చెప్పారు. బంగారం, వెండి ధరలు పెరిగిన ప్రభావం ఈ చీరలపై పడింది. ఈ సాంప్రదాయ చీరలపై జరీని వెండి, బంగారం దారాలతో డిజైన్ చేస్తారు. కంచిపట్టు చీరల పట్ల కస్టమర్ల వైఖరి ప్రస్తుతం మారుతున్నదని ఆయన తెలిపారు. పలువురు కస్టమర్లు ఒక బడ్జెట్‌తో షోరూమ్‌కు వస్తారని, తక్కువ బంగా రం, వెండి కంటెంట్ ఉన్న పట్ట చీరలపై మొగ్గుచూపు తున్నారని, అలాగే వారి బడ్జెట్‌కు తగిన రీతిలో కొనే చీరల సంఖ్య తగ్గించుకుంటున్నారని వివరించారు. అంతేకాకుండా బంగారు, వెండి కలపని జరీ ఉన్న కంచి పట్టు చీరలు చౌకగా లభిస్తుండటంతో వీటి కొనుగోళ్లకు మరికొంతమంది కస్టమర్లు మళ్లుతున్నారు.
రూ.70 వేల చీర రూ.1 లక్షపైనే..
గత ఏడాది అక్టోబర్ల్రో రూ.5,350 వద్దనున్న 22 క్యారెట్ల బంగారం ధర మే 21 నాటికి రూ. 6,800 స్థాయిని మించిపోయింది. అలాగే గ్రాము వెండి ధర రూ.75.5 నుంచి రూ.101 స్థాయికి ఎగిసిపోయింది. ఈ నేపథ్యంలో గత అక్టోబర్ నుంచి కంచి పట్టు చీరల ధరలు 40 శాతం నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. అక్టోబర్‌లో రూ.70,000 ఉన్న పట్టు చీర ధర ఇప్పుడు ఏకంగా రూ.1 లక్ష దాటిపోయింది. ఇంత స్వల్పకాలంలో పట్టు చీరల ధరలు ఇంతిలా పెరగడం ఇదే ప్రధమమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రూ. 10,000 కోట్ల టర్నోవర్ గల కాంచీపురం పట్టు చీరల పరిశ్రమపై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తున్నదని కాంచీపురం సిల్క్ శారీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధి వీకే దామోదరన్ చెప్పారు. భౌగోళిక గుర్తింపు ఉన్న కంచి పట్టు చీరలపై దక్షిణాది వాసులకు ఎంతో మక్కువ. ప్రతీ కంచి పట్టు చీర ఖరీదు రూ.20,000 నుంచి రూ. 2.5 లక్షల వరకూ ఉంటుందని, ఇప్పుడు అధిక ధరగల చీరల తయారీని నిలిపివేసినట్టు వీవర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు చెప్పారు.






