21 March, 2026 | 3:46 PM

విద్యారంగానికి కనీసం 20 శాతం బడ్జెట్ ను కేటాయించాలి

21-03-2026 02:11 PM

 24న జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శనలు

విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్

మాటలకు చేతలకు పొంతనలేని ప్రభుత్వం

టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల అనిల్ కుమార్

కామారెడ్డి, మార్చి 21 (విజయక్రాంతి): విద్య రంగానికి కనీసం 20% బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించాలని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు  చకినాల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నే బోయిన తిరుపతి లు అన్నారు.అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ బడ్జెట్ను కేటాయించి ప్రకటిత విద్యా లక్ష్యాలను వమ్ము చేశారని, టీపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి లు అన్నారు.  రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3,24,234 కోట్లలో కేవలం విద్యారంగానికి 26,674 ఓట్లు కేటాయించారు.  ప్రస్తుత బడ్జెట్ లో గత సంవత్సర కేటాయింపులకు కేవలం 0.63 % మాత్రమే పెంచి కేటాయింపులను 8.23% కుదించారు.

విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామని అట్టహాసంగా ప్రకటిస్తూ, ఉన్న స్కూళ్లను బలోపేతం చేయడం విస్మరించి ఇంటిగ్రటెడ్ స్కూలంటూ, పబ్లిక్ స్కూలంటూ విద్యా కమీషన్ రిపోర్ట్ వచ్చిన తరుణంలో దిగువ స్థాయిలో విద్యా రంగానికి కేటాయింపులు జరపడం గర్హనీయం. ఈ బడ్జెట్ వల్ల విద్యారంగం మరింత కునారిల్లి  పేదలు నాణ్యమైన విద్యను పొందలేని పరిస్థితులు ఉత్పన్న మవడమే కాకుండా, అరకొర వసతులతో ఉన్న పాఠశాల వ్యవస్థ , మరింత దుర్భర స్థితిలోకి నెట్టివేయబడుతుంది.విద్యారంగ బలోపేతానికి కొఠారి కమీషన్ తో పాటుగా, అనేక మంది విద్యావేత్తలు, ఉపాధ్యాయ ఉద్యమ సంఘాలు బడ్జెట్ లో విద్యారంగానికి 30%కేటాయింపులు జరుపాలని దశబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి.

పాలక పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% బడ్జెట్ను కేటాయిస్తామని హామీ పడుతూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తామిచ్చిన మాటను సైతం నిలబెట్టుకోక పోవడం శోచనీయం . గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాలకుల నిర్లక్ష్యం వల్ల 2021 -22 లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 27 లక్షల విద్యార్థుల సంఖ్య నేడు 16 లక్షలకు పడిపోయిందన్నారు. నాణ్యమైన విద్య, తరగతి గదుల నిర్మాణం, ఉపాధ్యాయుల నియామకం,  భౌతిక వసతులు, సానిటేషన్, కంప్యూటర్, గ్రంథాలయాలు, స్పోర్ట్స్ ను తదితర విషయాల అభివృద్ధి మొత్తం బడ్జెట్ కేటాయింపుల పైననే ఆధారపడుతుందన్నారు.

తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ ప్రకారం అత్యంత నిర్లక్ష్యానికి గురికాబడ్డ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం ఈ బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కెటాయింపులు జరుపాలని అన్నారు,రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ ప్రయోజనాల పెండింగ్ బిల్లులను ఏక మొత్తంలో విడుదల చేయాలని, టీచర్ల పెండింగు బిల్లులు, పీఆర్సీ  ప్రకటనను డిమాండ్ చేస్తూ ఈనెల మార్చి 24న అన్ని జిల్లాల్లోని జిల్లా కలెక్టర్ ల ముందు టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షు డు సకినాల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నే బోయిన తిరుపతి లు కోరారు.