నకిలీ ఎల్‌ఆర్‌ఎస్‌తో భవన అనుమతి

17-09-2026 | 05:30am
  1. అనుమతి రద్దు చేసిన సీఎంసీ అధికారులు
  2. మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు.. ఎఫ్‌ఐఆర్ నమోదు

శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నకిలీ పత్రాలు(Forged documents) సమర్పించి భవన నిర్మాణ అనుమతి(Building construction permit) పొందిన వ్యవహారం మాదాపూర్ పోలీస్స్టేషన్(Madhapur Police Station) పరిధిలో వెలుగుచూసింది. గుట్టల బేగంపేట్లోని ఓ స్థలానికి సంబంధించి టీజీబీపాస్ ద్వారా అనుమతి పొందేందుకు తప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ పత్రాల(LRS documents)ను సమర్పించినట్లు అధికారులు గుర్తించా రు. ఫిర్యాదు అందిన అనంతరం పత్రాలను పరిశీలించిన సీఎంసీ అధికారులు(CMC officials) భవన నిర్మాణ అనుమతిని రద్దు చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మా దాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    అసలు యజమాని సోదరుడేనంటూ ఫిర్యాదు..

గుట్టల బేగంపేట్ గ్రామ(Guttala Begumpet Village) పరిధిలోని సర్వే నంబరు 32లో ఉన్న ప్లాట్ నంబరు 55కు సంబంధించి షేక్ మస్తాన్ అనే వ్యక్తి టీజీబీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతి పొం దినట్లు అధికారులు తెలిపారు. అయితే సద రు స్థలానికి తన సోదరుడే అసలు యజమా ని అని పేర్కొంటూ ఓ వ్యక్తి కూకట్పల్లి జోన్, మాదాపూర్ సర్కిల్50 డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో అనుమతి పొందేందుకు సమర్పించిన పత్రాలపై అధికారులు దృష్టి సారించారు.

    పరిశీలనలో నకిలీ పత్రాల వ్యవహారం..

ఫిర్యాదు ఆధారంగా సంబంధిత రికార్డులను పరిశీలించిన అధికారులకు అనుమతి కోసం సమర్పించిన ఎల్‌ఆర్‌ఎస్ పత్రాల్లో అనుమానాస్పద అంశాలు కనిపించాయి. ఆ పత్రాలు సదరు స్థలానికి సంబంధించినవిగా కాకుండా వేరే వ్యక్తుల పేర్లతో జారీ అయినట్లు గుర్తించారు. అలాగే భవన నిర్మాణ అనుమతికి అవసరమైన యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉండగా, దాని స్థానంలో కేవలం అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే సమర్పించినట్లు అధికారులు గుర్తించారు.

దీంతో అనుమతి పొందే సమయంలో వాస్తవాలను పూర్తిగా వెల్లడించకుండా, తప్పుడు లేదా సంబంధం లేని పత్రాలను సమర్పించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

    అనుమతి రద్దు.. అయినా నిర్మాణానికి యత్నం..

పత్రాల పరిశీలన అనంతరం నిబంధనలకు విరుద్ధంగా పొందినట్లు గుర్తించిన భవన నిర్మాణ అనుమతిని సీఎంసీ అధికారులు రద్దు చేశారు. అయితే అనుమతి రద్దు చేసిన తర్వాత కూడా సదరు స్థలంలో నిర్మాణ పనులు కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు పోలీసులను ఆశ్రయించారు.

డీసీ ఫిర్యాదుతో కేసు నమోదు..

నకిలీ ఎల్‌ఆర్‌ఎస్ పత్రాలను సమర్పించడం, అవసరమైన యూఎల్సీ క్లియరెన్స్ లేకుండానే భవన నిర్మాణ అనుమతి పొందడం, అనుమతి రద్దు చేసిన అనంతరం కూడా నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించడం తదితర అంశాలపై మాదాపూర్ పోలీసులకు సర్కిల్50 డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రికార్డులపై పోలీసుల ఆరా..

కేసు దర్యాప్తులో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్ రికార్డులు, యూఎల్సీకి సంబంధించిన వివరాలు, టీజీబీపాస్లో సమర్పించిన పత్రాలు, భవన నిర్మాణ అనుమతి ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్థల యాజమాన్యానికి సంబంధించిన పత్రాలతోపాటు అనుమతి పొందిన విధానంపైనా ఆరా తీస్తున్నారు. నిర్మాణ పనులు కొనసాగించేందుకు జరిగిన ప్రయత్నాలపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తులో వెలుగుచూసే వాస్తవాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు