రెండో రోజూ బుల్స్ దూకుడు
బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు గ్రీన్‌సిగ్నెల్ ఇవ్వడంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ జోరు చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం మరో 693 పాయింట్లు పెరిగి 75,074 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 915 పాయింట్లు ఎగిసి 75,293 పాయింట్లను సైతం తాకింది. వరుస రెండు రోజు ల్లో సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు ర్యాలీ జరిపింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న సెన్సెక్స్ 4,300 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే. -
న్యూఢిల్లీ, జూన్ 6: తాజాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 289 పాయింట్లు ర్యాలీ జరిపి 22,910 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకగా, ముగింపులో లాభాల స్వీకరణతో కొంతమేర దిగివచ్చి 201 పాయింట్ల లాభంతో 22,821 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచి మంగళవారం 1,300 పాయింట్లకుపైగా పతనంకాగా, బుధ, గురువారాల్లో 900 పాయింట్లకుపైగా రికవరీ అయ్యింది. రియల్టీ, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయగా, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్ షేర్లలో లాభాల స్వీకరణ జరిపారు.
ఆర్బీఐ పాలసీపై దృష్టి
కొత్త సంకీర్ణ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సూచీలు వాటి పాజిటివ్ మూమెంటంను కొనసాగించాయని, కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు మార్కెట్లో బలపడ్డాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే కొత్త క్యాబినెట్ కూర్పు, వచ్చే బడ్జెట్లో వెల్లడయ్యే విధాన చర్యలపట్ల ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన ఉన్నదని నాయర్ వివరించారు. అలాగే శుక్రవారం వెల్లడికానున్న రిజర్వ్‌బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాల కోసం మార్కెట్ వేచిచూస్తున్నదని అన్నారు. తదుపరి ట్రెండ్ అంతర్జాతీయ సంకేతాల ఆధారంగా ఉం టుందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.
ఇన్వెస్టర్ల చెంతకు రూ.21 లక్షల కోట్ల సంపద
మంగళవారం నాటి పతనంతో ఒక్క రోజులోనే రూ.31 లక్షల కోట్ల సంపదను నష్టపోయిన ఇన్వెస్టర్లు బుధ, గురు వరుస రెండు రోజుల్లో రూ.21 లక్షల కోట్ల సంపదను తిరిగి రాబట్టుకున్నారు. మార్కెట్ తాజా బౌన్స్‌బ్యాక్‌తో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రెండు రోజుల్లో రూ.21,05,298 కోట్లు పెరిగి 4,15,89,003 కోట్లకు చేరింది. క్రితం రోజు ఇది రూ.3,94,83,705 లక్షల కోట్లకు (4.73 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది.
వెలుగులో ఐటీ షేర్లు
గత కొద్ది రోజులుగా వెనుకంజలో ఉన్న ఐటీ రంగ షేర్లు గురువారం ఒక్కసారిగా దూసుకొచ్చాయి. సెన్సెక్స్ బాస్కె ట్‌లో అన్నింటికంటే అధికంగా హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రాలు 4 శాతం ర్యాలీ జరిపాయి. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రోలు 2 శాతం మధ్య పెరిగాయి. ఇతర రంగాల షేర్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీలు 3 శాతం పుంజుకోగా, లార్సన్ అండ్ టుబ్రో 2 శాతం మేర పెరిగింది. మరోవైపు హిందుస్థాన్ యూనీలీవర్, ఏషి యన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మాలు 2 శాతం వరకూ నష్టపోయాయి.
వివిధ రంగాల సూచీల్లో అన్నిం టికంటే అధికంగా రియల్టీ ఇండెక్స్ 4,85 శాతం ఎగిసింది. ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 3.69 శాతం, పవర్ ఇండెక్స్ 2.87 శాతం, ఐటీ ఇండెక్స్ 2.86 శాతం, యుటిలిటీస్ సూచి 2.52 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 2.34 మేర పెరిగాయి. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం షేర్లలో 3,009 షేర్లు లాభ పడగా, 834 షేర్లు తగ్గాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.28 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచి 3.06 శాతం ఎగిసింది.






