25 July, 2026 | 1:47 AM

అధ్వానంగా మారిన బూర్గంపాడు-సారపాక రహదారి

25-07-2026 12:00 AM

బూర్గంపాడు, జూలై24 (విజయక్రాంతి): బూర్గంపాడుసారపాక ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. అడుగడుగునా ఏర్పడిన భారీ గుంతలు, వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, పా రిశ్రామిక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాలు కురిసినప్పుడల్లా గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి పరిస్థితి కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు జారి గాయపడిన ఘటనలు చో టుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నా రు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రమాదాల భయం వెంటా డుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతం సారపాకకు వెళ్లే కీలక మార్గం కావడంతో ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిని వినియోగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బూర్గంపాడుసారపాక రహదారిని పూర్తిస్థాయిలో పునర్నిర్మించి నూతన రహదారిని వెంటనే వేయాలని సీపీఐ(ఎంఎల్) రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పున్నం చంద్ డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నాణ్యమై న రహదారి నిర్మాణానికి నిధులు మంజూ రు చేయాలని కోరారు.

కేవలం గుంతలు పూడ్చడం కాకుండా శాశ్వత పరిష్కారం చూ పాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులు ప్రారంభించాలని వాహనదారులు కోరుతున్నారు.