గోదాముల నిర్మాణానికి స్థలాల పరిశీలన
వేములవాడ, జులై 24, (విజయక్రాంతి): ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార శాఖ చేపట్టనున్న గోదాముల నిర్మాణం కోసం వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం సమీపంలోని తెట్టకుంట, మారుపాక గ్రామాల్లోని స్థలాలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం పరిశీలించారు. గోదాముల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసి, పనులను త్వరగా ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం చింతలఠాణ ఆర్ అండ్ ఆర్ కాలనీ వద్ద ప్రతిపాదిత ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. సర్వే నంబర్లు, విస్తీర్ణం తదితర వివరాలను తెలుసుకుని, మిగతా ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓ కేఎస్బీ కుమారి, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.






