01-11-2025 07:33:20 PM
కరీంనగర్,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సిందూర్ , ఇండియన్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలపై బిజెపి శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జమ్మికుంట బిజెపి శ్రేణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారన్నారు.
దేశాన్ని, సైనికుల త్యాగాలను, పోరాటాలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కించపరిచిన పంథాలోనే సీఎం రేవంత్ రెడ్డి వెళుతున్నారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తో యావత్ ప్రపంచానికి భారతదేశ శక్తి ఏంటో తెలిసొచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం ఇంకా తెలియకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ ప్రారంభించి, ఇందులో భారతదేశం విజయం సాధించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సిందూర్ పై, ఇండియన్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలకు బే షరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.