29-07-2025 12:25:00 AM
ప్రయాణికులకు అవస్థలు
మహబూబాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్ స్టేషన్లు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనితో బస్ స్టేషన్లలో ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని కేసముద్రం, గూడూరు బస్ స్టేషన్లు ప్రయాణికులకు మరింత ఇబ్బందిగా మారాయి.
కేసముద్రం బస్ స్టేషన్ చాలాకాలంగా వినియోగానికి దూరంగా ఉండగా ఇటీవల కొత్తగా బస్సు సర్వీసులు పెంచడంతో పాటు కేసముద్రం ద్వారా ప్రయాణించే ఆర్టీసీ బస్సులను బస్ స్టేషన్ లోకి వచ్చి వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే బస్ స్టేషన్ లో ప్రయాణికుల కు ఎలాంటి సౌకర్యాలు లేవు. కూర్చోవడానికి కూడా వసతి సరిగా లేదు. అలాగే టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం లేదు.
తాగునీటి వసతి అసలే లేదు. ఫలితంగా బస్టాండ్ లో ప్రయాణికులు నిరీక్షించే పరిస్థితి లేక రోడ్లపైనే ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ నిరీక్షించాల్సి వస్తోంది. దీనితో కేసముద్రం బస్టాండ్ లోకి బస్సులు మాత్రమే వెళ్లి వస్తున్నాయి. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో అధికారులు స్పందించి బస్టాండ్ లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు.
ఇక మహబూబాబాద్ నర్సంపేట ప్రధాన రహదారిపై ఉన్న గూడూరు బస్టాండు వర్షాకాలంలో అడుగు తీసి అడుగు పెట్టలేనంత విధంగా బురద మయంగా మారుతుంది. గతంలో కొంతకాలం బస్టాండ్ లోకి బస్సులు వెళ్లకుండా కేవలం రోడ్డుపైనే నిలిచి వెళ్లిపోతుండడంతో బస్టాండు పూర్తిగా నిరుపయోగంగా మారింది. దీనితో బస్టాండు స్థలం పూర్తిగా అపరిశుభ్రంగా మారడంతో మండల కేంద్ర ప్రజలు బస్టాండ్ వినియోగం లోకి తేవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
తిరిగి ఆర్టీసీ బస్సులను బస్టాండ్ లోకి వెళ్లి వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే బస్టాండు ఆవరణ పూర్తిగా గతుకులమయమై వర్షాకాలంలో పూర్తిగా నీరు నిలిచి బురదగా మారుతుంది. దీనితో బస్టాండు లోకి వెళ్లి బస్సు ఎక్కడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ నుండి భద్రాచలం, మహబూబాబాద్, కొత్తగూడెం, నర్సంపేట తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు లోపలికి వచ్చి వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ ఆవరణ పూర్తిగా సిమెంట్ రోడ్డు వేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.