17 August, 2026 | 1:17 AM

కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి

17-08-2026 12:43 AM

కొమురవెల్లి, ఆగస్ట్ 16: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి  క్షేత్రానికి భక్తులుపోటెత్తారు. గత రెండు మూడు వారాలు భక్తులు సందడి లేక బోసిపోయిన పురవీధులు  శ్రావణమాసం రావడంతో భక్తులతో కళకళలాడాయి.   శ్రావణమాసం లో మొదటి  ఆదివారం సందర్భంగా భక్తుల తాకిడి కొనసాగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు గంటన్నరకు పైగా సమయం పట్టింది. ఆదివారం ఉదయం నుంచి మల్లన్న క్షేత్రంలో భక్తుల కొలహాలం మొదలైంది.

ముందుగాభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి వారి కోనేట్లో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ముఖ మండపం, గంగిరేణి చెట్టు కింద బోనాలు చెల్లించి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించిన అనంతరం, భక్తితో తల్లిని వేడుకున్నారు.

శ్రావణమాసం కావడంతో మల్లన్న ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా  మారాయి. ఆలయ పార్కింగ్ ప్లేసులు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. భక్తుల రద్దీకి తగ్గట్టు ఆలయ వర్గాలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కలుగజేశారు. ఆలయ పరిసర ప్రాంతాల లో ఏర్పాట్లను ఈవో  కట్ట సుధాకర్ రెడ్డి పర్యవేక్షించారు.