పేదల ఓట్లపై కుట్ర
- ‘సర్’ రెండో దశపై అప్రమత్తంగా ఉండాలి
- కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
- డీసీసీ అధ్యక్షులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి) : తెలంగాణలో పేద ప్రజల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ సూచించారు. ఆదివారం సికింద్రాబాద్, హైదరాబాద్, ఖైరతాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా రెండో దశపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అభ్యంతరాలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు ఆయా జిల్లాలో పార్టీ పరిస్థితి, చేపడుతున్న కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. సర్ రెండో దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అదే విధంగా ‘సర్’ పర్యవేక్షణ కోసం పార్టీపరంగా నియమించిన బీఎల్‌ఏలకు శిక్షణ ఇచ్చారు.
అర్హుల ఓట్లు ఒక్కటి కూడా పోవద్దని, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుండాలని వారికి సూచించారు. సమావేశంలో మంత్రి అజారుద్దీన్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు, క్రిష్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్‌జాన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్, ఎమ్మెల్యే శ్రీగణేష్, పార్టీ నేతలు కోట నీలిమ తదితరులు పాల్గొన్నారు.
బూత్‌స్థాయిలో బలంగా ఉంటేనే గెలుస్తాం : పీవీ మోహన్
పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండాలని ఏఐసీసీ పరిశీలకుడు పీవీ మోహన్ పార్టీ నాయకులకు సూచించారు. ఆదివారం జరిగిన రంగారెడ్డి జిల్లా డీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న కార్పొరేషన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడం ప్రధాన బాధ్యత అన్నారు. అందులో భాగంగా ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
సమర్థులైన, నిబద్ధత కలిగిన నేతలను డీసీసీ అధ్యక్షులుగా నియమించడంతో ఈ ప్రక్రియ మొదలైందన్నారు. సంస్థాగతంగా పార్టీ పునర్ వ్యవస్థీకరణ బూత్ స్థాయి వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర, న్యాయయాత్ర ద్వారా తాను చాలా తెలుసుకున్నానని పేర్కొన్నారు.






