ఇల్లు కొనండి ప్లీజ్..
వేలానికి ఆంగ్ సాన్‌సూకీ ఇల్లు
కొనేందుకు ఆసక్తిచూపని బిడ్డర్లు
మరోసారి వేలం ప్రక్రియ!
న్యూ ఢిల్లీ, ఆగస్టు 15: నోబెల్ బహుమతి గ్రహీత, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్ సాన్‌సూకీ ఇంటివేలం ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. 142 మిలియన్ డాలర్ల ధరతో ఆమె నివాసాన్ని వేలంలో ఉంచగా.. కొనేందుకు బిడ్డర్లు ఎవరూ ఆసక్తి చూపలేదు. మయన్మార్ దేశంలోని ప్రముఖ నగరమైన యాంగూన్‌లో సరస్సు ఒడ్డున 1.9 ఎకరాల విస్తీర్ణంలో ఆంగ్ సాన్‌సూకీ ఇల్లు ఉంది. స్వాతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించిన ఆంగ్‌సాన్‌సూకీ తండ్రి జనరల్ ఆంగ్ సాన్ 1947లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆమె తల్లికి యాంగూన్ నగరంలో రెండస్తుల భవనాన్ని కేటాయించింది. అందులోనే సూకీ 2010 వరకు 15ఏళ్లపాటు గృహనిర్భంధంలో ఉన్నారు.
యాంగూన్ నగరంలోని ఇంటి విషయంలో సూకీ, ఆమె సోదరుడికి మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. ఆ ఇంటిని వేలం వేస్తే వచ్చే డబ్బును వారిద్దరికి పంచాల్సి ఉంది. ఆ ఇంట్లో ఆంగ్ సాన్ సూకీ గృహ నిర్బంధంలో ఉన్న సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ తదితర ప్రముఖలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదే ఇంట్లో గృహ నిర్బంధంలో ఉన్న సమయంలో (1991) సూకీ నోబెల్ బహుమతి కూడా పొందారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఆ ఇంటిని వేలం వేస్తే కనీసం ఒక్క బిడ్డు కూడా రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మరోసారి ఇంటి వేలం ప్రక్రియ జరుగుతుందని సమచారం.




