తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ భవన్(Telangana Bhavan) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హరీశ్ రావు(Harish Rao arrested), బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ మంత్రులతో చర్చకోసం మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరింది. రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. చర్చకు వస్తుంటేఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు.
పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. లోపులాటలో హరీశ్ రావు కిందపడిపోయారు. పోలీసులను పెట్టి అడ్డుకుంటే మీరు పారిపోతున్నట్లే లెక్క అని హరీశ్ రావు వెల్లడించారు. మీరు తప్ప చేయకుంటే ఎందుకు భయపడుతున్నారు.? అని ప్రశ్నించారు. అన్ని ఆధారాలు పట్టుకుని మంత్రులతో చర్చకు వస్తుంటే ఎందుకు ఆపుతున్నారు?, అవినీతికి పాల్పడ్డారు కనుకే చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ అవినీతిని అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు చర్చకు రావాలని సవాలు చేసిన పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ముగ్గురు మంత్రులకు ఫోన్ చేశా.. ఎవరు ఎత్తలేదని ఆయన వివరించారు. ఈ విషయాన్ని విడిచి పెట్టం.. ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.






