12 April, 2026 | 12:00 AM

గాజాలో 40వేలు దాటిన మరణాలు

16-08-2024 01:16 AM
  1. విషాదం మిగులుస్తోన్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం
  2. మృతుల్లో చిన్నారులు, మహిళలే అధికం

న్యూ ఢిల్లీ, ఆగస్టు 15: గాజాపై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో వేలమంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో యుద్ధం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. ఒకవైపు కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. దాడులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల గాజా దేశ ఆరోగ్య విభాగం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మరణించిన వారి సంఖ్య 40వేలకు పైగా ఉంటుందని తెలిపింది. ఈ మరణాల్లో మిలిటెంట్లు ఎంతమంది ఉన్నారో స్పష్టంగా చెప్పనప్పటికీ.. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉంటారని ప్రకటించడంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కవలలు పుట్టిన నాలుగు రోజులకే..

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న వరుస బాంబు దాడుల నేపథ్యంలో ఇటీవల వెలుగుచూసిన ఓ ఘటన ప్రపంచ దేశాలను తీవ్రంగా కలిచివేస్తోంది. పుట్టిన 4రోజులకే కవలలను బాంబుదాడిలో కోల్పోయిన ఆ తండ్రి బాధను మాటల్లో చెప్పలేం. ఇటీవల ఓ పాలస్తీనీ దంపతులకు కవలలు పుట్టారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలు  ఆశ్రయం పొందుతున్న శిబిరంలో ఉండగా.. ఆ బిడ్డల తండ్రి పుట్టిన పిల్లలకు సంబంధించి బర్త్ సర్టిఫికెట్లు తీసుకురావడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లొచ్చేలోగా.. అతడి భార్య, కవలలు ఇద్దరూ ఆశ్రయం పొందుతున్న శిబిరంలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన బాంబు దాడుల్లో విగతిజీవులుగా పడిఉన్నారు. 

ఆకలిదప్పులు

ఇజ్రాయెల్ బాండుదాడుల్లో ఇప్పటికే మెజార్టీ నగరాలు నామరూపాలు లేకుండా పోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వారు తాత్కాలిక వైద్య శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే వారికి ఔషధాలు, ఆహారం, తాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. పారిశుద్ధ్యం సహా మెజార్టీ వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. అయితే నిరాశ్రయులు ఆశ్రయం పొందతున్న తాత్కాలిక శిబిరాలపై కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడంతో పౌరులకు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.