మహమ్మారిగా ఎంపాక్స్
వేగంగా విస్తరిస్తున్న అంటువ్యాధి.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో
ఆఫ్రికాలో పుట్టి ప్రపంచమంతా విస్తరణ.. అప్రమత్తమైన దేశాలు.. కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రపంచాన్ని మరో ముప్పు తరుముకొస్తున్నది. మంకీపాక్స్ (ఎంపాక్స్) అంటువ్యాధి అనేక దేశాలను భయపెడుతున్నది. ఇది విస్తరిస్తున్న వేగానికి త్వరలోనే మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్నదని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గురువారమే ప్రపంచ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ అత్యంత వేగంగా యూరప్, ఆసియా, అమెరికా ఖండాలను తాకింది. గురువారం స్వీడన్‌లో మంకీపాక్స్ కేసు నమోదుకాగా, శుక్రవారం పాకిస్థాన్‌లో వెలుగుచూసింది.
ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలపైనే పంజా విసురుతున్నది. పేదలు, నిర్భాగ్యులే బలవుతున్నారు. మంకీపాక్స్‌ను ఆఫ్రికాలో తొలిసారి 1958లో కోతుల్లో గుర్తించారు. 1970లో దీనిని తొలిసారి మనుషుల్లో కనుగొన్నారు. అయితే 2022కు ముందు వరకు దీనిపై ఎవరూ పెద్దగా దృష్టిపెట్టకపోవటంతో ఇప్పుడు పెను ముప్పుగా మారింది. ఆలస్యంగా మేల్కొన్న దేశాలు ఈ మహమ్మారి తమ భూభాగంలోకి రాకుండా కట్టడిచేసే చర్యల్లో మునిగిపోయాయి. చైనాలోని అన్ని విమానాశ్రయాల్లో ఎంపాక్స్ చెకింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. యూరప్, అమెరికా దేశాలూ ఇదే ఏర్పాట్లు చేసుకొంటున్నాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రపంచాన్ని మరో ముప్పు తరుముకొస్తున్నది. మంకీపాక్స్ అంటువ్యాధి అనేక దేశాలను భయపెడుతున్నది. ఇది విస్తరిస్తున్న వేగానికి త్వరలోనే మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్నదని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గురువారమే ప్రపంచ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ అత్యంత వేగంగా యూరప్, ఆసియా, అమెరికా ఖండాలను తాకింది. గురువారం స్వీడన్‌లో మంకీపాక్స్ కేసు నమోదుకాగా, శుక్రవారం పాకిస్థాన్‌లో వెలుగుచూసింది. ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలపైనే పంజా విసురుతున్నది. పేదలు, నిర్భాగ్యులే బలవుతున్నారు.
నిర్లక్ష్యం ఖరీదు
మంకీపాక్స్‌ను ఆఫ్రికాలో తొలిసారి 1958లో కోతుల్లో గుర్తించారు. 1970లో దీనిని తొలిసారి మనుషుల్లో కనుగొన్నారు. అయితే ఆఫ్రికాలోని మారుమూల భూమధ్యరేఖా శీతోష్ణస్థితి ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించటంతో శాస్త్రవేత్తలుగానీ, ఆరోగ్య సంస్థలుగానీ దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ ప్రాంతాలు ప్రపంచానికి దూరంగా ఉండటమే అందుకు కారణం. అందునా ఈ వైరస్ అధికంగా నిరుపేదలు ఉండే వెనుకబడిన దేశాల్లోనే వ్యాపించటంతో ధనిక దేశాలు పెద్దగా దృష్టిపెట్టలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు అందరినీ భయపెట్టే మహమ్మారి స్థాయికి చేరింది. ఇది తొలిసారి 2022లో అభివృద్ధి చెందిన దేశాలను భయపెట్టింది. దీంతో హడావిడిగా ఈ వైరస్ కట్టడికి భారీగా నిధులు వెచ్చించి పరిశోధన మొదలుపెట్టాయి. ఈ వైరస్ బయటపడిన తర్వాత నివారణపై క్రమబద్ధమైన పరిశోధన మొదలుకావటానికి 60 ఏండ్లు పట్టింది.
ఇది ఒక్కరి సమస్య కాదు
మంకీపాక్స్ అత్యధిక కాలం ఆఫ్రికాలోనే ప్రబలటంతో మిగతా ఖండాలు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇది మన సమస్య కాదులే అన్న ధోరణలో ఉన్నాయి. 2022 తర్వాతగానీ అన్ని దేశాలకు దాని ముప్పు తెలియరాలేదు. తాజాగా కాంగో తదితర దేశాల్లో మంకీపాక్స్‌పై ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించటంతో ప్రపంచం ఉలిక్కిపడింది. అంతలోనే యూరప్, ఆసియా, అమెరికా ఖండ దేశాల్లోనూ ఈ కేసులు వెలుగు చూస్తుండటంతో మరింత భయంగొలుపుతున్నది.
స్మాల్‌పాక్స్‌లాంటిదే
మంకీపాక్స్‌ను పలు పేర్లతో పిలుస్తున్నారు. మంకీపాక్స్, ఎంపాక్స్, ఎంపీఎక్స్‌పీ అనేవి దీని పేర్లు. ఇది సాధారణంగా పిల్లల్లో కనిపించే స్మాల్‌పాక్స్ వైరస్ కుటుంబానికి చెందినదే. ఇది ఇంతకాలం ‘స్థానిక’ వ్యాధిగానే పరిగణించబడింది. ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి. గతంలో మనుషుల నుంచి మనుషులకు సంక్రమించటం అరుదుగా జరిగింది. అటవీ జంతువులకు సన్నిహితంగా మెలిగే మనుషులకు ఎక్కువగా సోకేది. వ్యాధి సోకిన జంతువులను ఇతర ప్రాంతాలకు తరలించినప్పుడు కొత్త ప్రదేశాలకు విస్తరించేది. కానీ, 2022లో ఈ వైరస్ ఒక్కసారిగా విజృంభించింది. వాయువేగంతో 116 దేశాలకు విస్తరించింది. దీంతో అధికారికంగానే ఆ ఏడాది 99 వేల కేసులు నమోదయ్యాయి. 2022 ఆగస్టులో ప్రతివారం సగటున 6 వేల కేసులు నమొదయ్యాయి. అయితే మరణాలు మాత్రం 200 దాటలేదు.
స్వలింగ సంపర్కుల్లో అధికం
మంకీపాక్స్ ఉన్నట్టుండి ఎందుకు విశ్వరూపం చూపుతున్నది అన్నదానిపై పరిశోధన మొదలుపెట్టిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యకర అంశం ఒకటి తెలిసింది. ఆఫ్రికా బయట ఈ వ్యాధి పురుష స్వలింగ సంపర్కుల్లోనే అధికంగా విస్తరిస్తున్నట్టు గుర్తించారు.
పాక్‌లో తొలికేసు
పాకిస్థాన్‌లో తొలి మంకీ పాక్స్ కేసును గుర్తించారు. ఇటీవల సౌదీ అరేబియా నుంచి వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. మర్దాన్‌కు చెందిన ఈ వ్యక్తి పెషావర్‌లో వైరస్ బయటపడిందని బైబర్ మెడికల్ యూనివర్సిటీ ప్రకటించింది. కేసు బయటపడటంతో ఆ రోగి పాకిస్థాన్‌కు వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశాడు అన్నది తెలుసుకొనేందుకు ఆ దేశ వైద్యశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అప్రమత్తమైన దేశాలు
మంకీపాక్స్‌పై డబ్ల్యూహెచ్‌వో అత్యవసర పరిస్థితి ప్రకటించటంతో అన్నిదేశాలు అప్రమత్తమయ్యాయి. ఎవరికివారు దేశాల సరిహద్దుల్లో చెకింగ్‌ను కట్టుదిట్టం చేశాయి. చైనా తన దేశంలోని విమానాశ్రయాల్లో మంకీపాక్స్ చెకింగ్‌ను తప్పనిసరి చేసింది. యూరప్ దేశాలు కూడా ఇదే విధానాన్ని అమలుచేస్తున్నాయి. పొరుగుదేశంలో కేసు నమోదుకావటంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
మంకీపాక్స్ ఎంత డేంజర్?
- చిన్నారులు, గర్భిణిలు, బలహీనమైన రోగనిరోధకత ఉన్నవారు, హెచ్‌ఐవీ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి మంకీపాక్స్ ప్రాణాంతకంగా మారవచ్చు.
- వ్యాధి ఉన్నవారిని భౌతికంగా తాకినా, ఎక్కువసేపు వారితో గడిపినా ఈ వైరస్ త్వరగా సోకుతుంది. అయతే గాలిలో తేలిగ్గా వ్యాపిస్తుందన్న వాదనకు సరైన ఆధారాలు లభించలేదు.
- స్వలింగ సంపర్కులైన పురుషుల్లో ఇది త్వరగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో రెండేండ్ల క్రితమే ప్రకటించింది. దీని నివారణకు ఆరోగ్యకరమైన లైంగిక సంబంధాలు, వ్యాక్సిన్ల వాడకం మేలని సూచించింది.
- ప్రస్తుతం ఈ వ్యాధి కాంగోలో విధ్వంసం సృష్టిస్తున్నది. 2023, జనవరి నుంచి 27 వేల మందికి సోకింది. వారిలో 1100 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారు.
- ప్రస్తుతం ఈ వైరస్ రెండు విధాలుగా వ్యాప్తి చెందుతున్నది. క్లేడ్ 1 కాంగోలో, క్లేడ్ 1బీ రువాండా, ఉగాండా, బురిండీ, కెన్యాలో వ్యాపిస్తున్నది. స్వీడన్‌లో వెలుగుచూసిన కేసు కొత్తరకమైన క్లేడ్ 1బీ వైరస్‌ది.




