2 July, 2026 | 1:19 PM

పదేళ్ల అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలి: మంత్రి జూపల్లి

02-07-2026 12:47 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల( BRS debts) వివరాలపై చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణరావు(Minister Jupally Krishna Raoగన్‌పార్క్‌ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. చర్చకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అమరవీరుల స్తూపం వద్దకు ఎవరైనా రండని మంత్రి సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 7.3 లక్షల కోట్లు అప్పు చేసిందని మంత్రి జూపల్లి లెక్కచెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 74 వేల కోట్లు అప్పు చేశారని వివరించారు. వివిధ సంస్థల పేరుతో రూ. లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. 'నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. తాము అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పాలి. నేను చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేసేందుకు సిద్ధం.' అని జూపల్లి పేర్కొన్నారు. కార్పొరేషన్ పేరుతో అప్పు చేసి కాళేశ్వరం కట్టామని చెబుతున్నారు.

కార్పొరేషన్ పేరుతో చేసిన అప్పును రైతుల నుంచి వసూలు చేస్తారా? ఒక్కో రైతు నుంచి రూ. 20 లక్షలు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. నేను చెప్పిన అంకెలు తప్పయితే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.  మేం చేసిన ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని జూపల్లి ప్రశ్నించారు. నా వద్ద ఉన్న రికార్డులు , కాగితాలు ఇస్తా.. చర్చకు రావాలని సవాల్ విసిరారు. హరీశ్ రావు, కేటీఆర్ .. ఇంకా బుకాయిస్తున్నారని మంత్రి జూపల్లి విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులను కేసీఆర్ స్వయంగా మీడియాకు చెప్పాలని సవాల్  విసిరారు. గత ప్రభుత్వం చేసిన అప్పుకు నెలకు రూ. 6 వేల కోట్లు వడ్డీ కడుతున్నామని లెక్కచెప్పారు.