రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ ఆర్థిక భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరకు కేంద్రం ఆమోదం తెలుపుతూ కనీస మద్దతు కోసం రూ.2.6 లక్షల కోట్లు, కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి రూ.37,500 కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
కోల్ గ్యాసిఫికేషన్: ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు కోల్ గ్యాసిఫికేషన్ భారత్ లోనే తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు బొగ్గు వాయువీకరణ పథకానికి రూ. 37,500 కోట్ల కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే బొగ్గు వాయువు ఉత్పత్తిపై ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గ్యాస్ అవసరాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం ఎలా ఆత్మనిర్భర్ చేసుకోవాలి.? అని ప్రశ్నించారు.
ప్రపంచంలోనే బొగ్గు నిల్వలు భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయని, రాబోయే 200 ఏళ్ల అవసరాలకు సరిపడా బొగ్గు భారత్ ఉందన్నారు. కాబట్టి, ఆ బొగ్గును ఉపయోగించి గ్యాస్ ఉత్పత్తి చేయగలమా? దీనిపై మంచి ప్రయత్నం జరిగిందన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, భారత్ లో కోల్ గ్యాసిఫికేషన్ వస్తే 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. దీంతో ఏడాదికి రూ.6,300 కోట్ల ఆదాయం దేశానికి వస్తుందన్నారు. అంతేకాకుండా ఈ బొగ్గు వాయువు ఉత్పత్తి పథకంపై ఒక నిర్ణయం తీసుకున్నామని, బొగ్గు నుండి గ్యాస్ ఉత్పత్తి చేసి, ఆ గ్యాస్ నుండి ఎరువులు, విద్యుత్, బొగ్గు నుండి గ్యాస్ ఉత్పత్తి చేసి, గ్యాస్ నుండి వివిధ రకాల రసాయనాలను తయారు చేయడంపై కేంద్రమంత్రి వివరించారు.
ఖరీఫ్ పంటల కనీస మద్దతు: 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు గాను, 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల (MSP) పెంపునకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. MSP పెంపులో అత్యధిక పెరుగుదల పొద్దు తిరుగుడు విత్తనాలకు క్వింటాల్‌కు రూ.8,343, పత్తి(మధ్య శ్రేణి) క్వింటాల్‌కు రూ.8,267, పత్తి(దీర్ఘ శ్రేణి) క్వింటాల్‌కు రూ.8,667, నైజర్ సీడ్ క్వింటాల్‌కు రూ.515, నువ్వులు క్వింటాల్‌కు రూ.500, వరి క్వింటాల్‌కు రూ.2,461, జొన్నలు క్వింటాల్‌కు రూ.4,023, మొక్కజొన్నలు క్వింటాల్‌కు రూ.2,401, కందులు క్వింటాల్‌కు రూ.8,415, పెసల క్వింటాల్‌కు రూ.8,780, మినుములు క్వింటాల్‌కు రూ.8,200, పల్లి క్వింటాల్‌కు రూ.7,517 సిఫార్సు చేయబడింది.
ఉత్పత్తి వ్యయంపై రైతులకు ఆశించిన లాభాల శాతం పెసలకు (61%) అత్యధికంగా ఉంటుందని అంచనా వేయబడింది. ఆ తర్వాతి స్థానాల్లో సజ్జలు (56%), మొక్కజొన్న (56%), కందులు (54%) ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అహ్మదాబాద్ (సర్ఖేజ్) – ధోలేరా సెమీ హై-స్పీడ్ డబుల్ లైన్ ప్రాజెక్టుకు, సుమారు రూ. 20,667 కోట్ల మొత్తం వ్యయంతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) కింద ప్రైవేట్ భాగస్వామితో దీర్ఘకాలిక లైసెన్స్ ద్వారా నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నతీకరణ, ఆధునీకరణకు కేంద్రం ఆమోదించినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.






