6 May, 2026 | 11:27 AM

చెంచుపెంటలో రాక్షస రాజ్యం!

24-06-2024 01:00 AM
  1. పొలంకోసం చెంచు గిరిజనుడి మర్మాంగాలు కోసి హత్య?
  2. ప్రమాదంలో మృతిచెందినట్టు చిత్రీకరణ
  3. ఆలస్యంగా వెలుగుచూసిన మరో అమానవీయ ఘటన 

నాగర్‌కర్నూల్, జూన్ 23 (విజయక్రాంతి): కొల్లాపూర్ మండ లం మొలచింతలపల్లి చెంచుపెంటలో రాక్షసత్వం రాజ్యమేలుతోంది. కొందరు ఇసుకాసురులు, భూబకాసురులు మానవ మృగాలై నిరుపేద చెంచు గిరిజనులపై అత్యంత పాశవికంగా దాడిచేసి హతమారుస్తున్నారు. పెట్టిందే తినాలి.. చెప్పిందే చేయాలి.. అన్నవిధంగా చెంచులు, గిరిజనులను ఆట బొమ్మలుగా చేసి వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. చెంచుల వద్ద ఉన్న అటవీ భూముల కోసం ఇసుక తట్ట మోయలేకపోయినా పొడవాటి కర్రలతో శరీరభాగాలపై వాతలు పెట్టి వారికి బతికుండగానే నరకం చూపిస్తున్నారు.

ఇదంతా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి 15 కిలోమీటర్ల దూరంలోనే జరుగుతోంది. అయినా అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారం రోజుల క్రితం చెంచు మహిళను అత్యంత కిరాతకంగా జననాంగాలపై పచ్చికారం చల్లి, డీజిల్‌తో కాల్చి పాశవిక దాడిని మరువకముందే.. అదే గ్రామంలో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భూమి కోసం చెంచు గిరిజనుడి మర్మాంగాలను కోసి అత్యంత క్రూరంగా హతమార్చినట్టు బాధితుడి కుమారుడు ఆదివారం జిల్లా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్‌కి ఫిర్యాదు చేశారు. 

అమానవీయ ఘటన మరువకముందే

పొలం అమ్మడానికి ఓప్పుకోలేదన్న సాకుతో ఓ చెంచు మహిళపై ఇటీవల పాశవిక దాడి జరిగింది. ఆ ఘటన మరువకముందే ఆ మహిళా కుటుంబంలోని వ్యక్తిని అదే కారణంతో అత్యంత దారుణంగా హత్య చేసినట్లు  బయటపడింది. మొలచింతలపల్లి సమీపంలోని భ్రమరాంబిక కాలనీకి చెందిన అమాయక చెంచులను అదే గ్రామానికి చెందిన కొందరు ఇసుక వ్యాపారులు, భూఆక్రమణదారులు బెదిరింపులకు పాల్పడి వారితో నిత్యం వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. వారి వద్ద ఉన్న పొలాలను అక్రమంగా రాయించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు దాన్ని వ్యతిరేకించడంతో వారిని హత్య చేయడం లేదా ఇతరులు భయపడేలా పాశవికంగా హింసించి దాడిచేసి పొలాలను లాక్కుంటున్నారు. ఇలా జరుగుతున్నా సంబంధిత అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

సాగు చేసుకునే వెసులుబాటు లేక

మొలచింతలపల్లి పరిధిలోని భ్రమరాంబిక కాలనీకి చెందిన కొందరు చెంచు కుటుంబాలకు సమీప గ్రామ శివారులో ప్రతి కుటుంబానికి ఒక ఎకరం పొలం ఐటీడీఏ ద్వారా ౧౯౯౮లో పంపిణీ చేశారు. అయితే ఆర్థిక వెనకబాటు కారణంగా ఆ పొలాలను సాగు చేసుకునే పరిస్థితి లేకపోవడం అదే గ్రామానికి చెందిన బండి వెంకటేశ్, బండి శివయ్య, శ్యామ (సాంబశివుడు)లకు తమ భూములను కౌలుకు ఇచ్చారు. వీరికి ఆధార్ కార్డులు కూడా లేకపోవడంతో ఉపాధి హామీ పనులకు వెళ్లలేకపోతున్నారు. పొట్టకూటి కోసం అక్రమంగా తరలించే ఇసుక రవాణా, ఫిల్టర్ ఇసుక తయారీ కోసం వారి వద్దే రోజువారి కూలీలుగా పనిచేస్తున్నారు.

వీరి భూములపై అక్రమార్కులు కన్నేసి వారికి అవసరం ఉన్నా లేకున్నా అప్పులు ఇస్తున్నారు. అమాయకులతో సంతకాలను చేయించుకుని భూములను సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భూములను అమ్మడానికి ఒప్పుకోని వారిపై పాశవికంగా దాడిచేసి ఇతరులను భయబ్రాంతులకు గురిచేయడం పనిగా పెట్టుకున్నారు. కాగా తాజాగా బయటపడిన చెంచుమహిళ దాడికి సంబంధించిన వీడియోలో ఉన్న కాట్రాజు నాగన్న (50) ఈ నెల 4న చెంచుపెంట శివారులో విగతజీవిగా పడి ఉన్నాడు. విధుల్లో ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహేశ్, వాచర్లు లక్ష్మణ్, నర్సింహ్మ చూసి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అనుమానాస్పదంగా ఉందని పోస్టుమార్టం చేయించుకోవాలని సూచించారు.

అనంతరం చెంచులకు యజమానులుగా ఉన్న బండి వెంకటేశ్, బండి శివన్న.. చెంచులను బెదిరించి పోస్టుమార్టం జరపకుండానే అంత్యక్రియలు జరిపించారు. తాగిన మైకంలోనే మృతిచెందినట్టు కట్టుకథ అల్లి తనతోపాటు తాగిన వ్యక్తికి జరిమానా కట్టాలంటూ రూ.30 వేలు రామ గురువయ్య చేతులమీదుగా ఇప్పించారు. ఇందుకు కూడా అప్పుగా బండి వెంకటేశే డబ్బులు ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఈ నెల 14న నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమానికి ఇటీవల తీవ్రంగా గాయపడిన కాట్రాజు ఈశ్వరమ్మ పాల్గొని తిరిగి చుక్కాయిపల్లి వెళ్లింది.

దీంతో కోపంతో రగిలిపోయిన బండి శివుడు, బండి వెంకటేశ్, బండి శివమ్మ.. ఆమెను పట్టుకొచ్చి గుడిసెలో బంధించి దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే నాగన్న మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ఆదివారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ చెంచుకాలనీలో పర్యటించారు. చెంచులపై దాడులను ఖండించారు. చెంచు పెంటలో ఇంత అరాచకం జరుగుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి చెంచులకు న్యాయం చేయాలని ఆదేశించారు.