ధ్యానంలోకి వెళ్లిన మోదీ
48 గంటల పాటు ధ్యానం చేయనున్న ప్రధాని
కన్యాకుమారిలోని వివేకానందుడి స్మారక స్థూపం వద్ద ధ్యానం
2 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు
న్యూఢిల్లీ, మే 30: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ప్రధాని నరేంద్రమోదీ ధ్యాన ముద్రలోకి వెళ్లారు. 45 గంటల పాటు ధ్యానం చేసుకునేందుకు కన్యాకుమారి చేరుకున్నారు. తొలుత కన్యాకుమారి లోని అమ్మన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివేకానంద స్మారక స్థూపం వద్ద ఉన్న ధ్యానమందిరంలో ధ్యాన ముద్రలోకి వెళ్లారు.
ఇక గురువారం సాయంత్రం ప్రారంభమైన మోదీ ధ్యానం జూన్ 1వ తేదీ వరకు కొనసాగనుంది. ఇదే ప్రాంతంలో స్వామి వివేకానంద 131 సంవత్సరాల కింద ధ్యానం చేసి, మోక్షం పొందారు. ప్రధాని మోదీ ప్రతి ఎన్నికల తర్వాత ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి ధ్యానం చేస్తూ ఉండేవారు. 2014 ఎన్నికల తర్వాత శివాజీ ప్రతాప్‌గఢ్‌లో, 2019 ఎన్నికల్లో కేదార్‌నాథ్‌లో ధ్యానం చేసిన విషయం తెలిసిందే. ఇక, ప్రధాని ధ్యానం చేసినంత సేపు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏకంగా 2 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. వారితో పాటు ఇండియన్ కోస్ట్ గార్డు, నావికాదళం కూడా ప్రధాని భద్రతలో భాగం కానున్నాయి.






