ఢిల్లీలో డేంజర్ బెల్స్
- వడదెబ్బకు 20 మంది మృతి
హై అలర్ట్ ప్రకటించన కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 19: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండతీవ్రతకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు రోజుల నుంచి వందలాది మంది ప్రజలు వడదెబ్బ బారిన పడ్డారు. సాధారణంగా ఉష్ణోగ్రత 35 37 డిగ్రీలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 46 డిగ్రీలు నమోదవుతున్నది. వడదెబ్బతో చికిత్స పొందుతూ ఇప్పటివరకు ౨౦ మంది మృత్యువాత పడ్డారు. పలువురి పరిస్థితి విషమించి వెంటిలేటర్‌పై చావుబతుకులతో పోరాడుతున్నారు.
వడదెబ్బ కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాలు సంభవిస్తున్నాయని, మృతుల్లో ఎక్కువ మంది కూలి పనులు చేసుకునే వారే అధికంగా ఉన్నారని మనోహర్ లోహియా దవాఖాన వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. మరికొన్ని రోజులు వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు ఢిల్లీవాసులను అప్రమత్తం చేస్తున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో కేంద్రప్రభుత్వం ఢిల్లీలో అప్రమత్తత ప్రకటించింది. నగరంలోని దవాఖానలన్నీ వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా బుధవారం ఆదేశించారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.






