కెనరా బ్యాంక్ నికరలాభం రూ. 3,757 కోట్లు
చొప్పున భారీ డివిడెండు
న్యూఢిల్లీ, మే 8: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికరలాభం మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 18 శాతం వృద్ధి చెంది రూ.3,757 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,174 కోట్ల నికరలాభాన్ని కనపర్చింది. బుధవారం సమావేశమైన బ్యాంకు డైరెక్టర్ల బోర్డు రూ.10 ముఖవిలువగల ఒక్కో షేరుపై భారీగా రూ.16.10 చొప్పున డివిడెండు (161 శాతం) సిఫార్సుచేసింది. షేర్‌హోల్డర్ల అనుమతించిన తర్వాత డివిడెండు చెల్లిస్తారు. ముగిసిన త్రైమాసికంలో కెనరా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.9,580 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ 2.95 శాతం నుంచి 3.05 శాతానికి మెరుగుపడింది. ఫలితాల వెల్లడి సందర్భంగా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కే సత్యనారాయణ రాజు మీడియాతో మాట్లాడుతూ డిపాజిట్ల సేకరణలో గట్టి పోటీ ఉన్నా, వడ్డీ మార్జిన్లను పెంచుకోగలిగామన్నారు. డిపాజిట్లపై వ్యయం 4.38 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగిందని, ఇదే సమయంలో అడ్వాన్సుల ఈల్డ్ 7.70 శాతం నుంచి 8.71 శాతానికి మెరుగుపడిందని వివరించారు. బ్యాంక్ వడ్డీయేతర ఆదాయం 9 శాతం పెరిగి రూ. 5,217 కోట్లకు చేరింది. కేటాయింపులు రూ.3,094 కోట్ల నుంచి రూ. 2,481 కోట్లకు తగ్గాయి.
రూ.13 లక్షల కోట్లకు డిపాజిట్లు
కెనరా బ్యాంక్ డిపాజిట్లు 2024 మార్చి 31నాటికి రూ.13.12 లక్షల కోట్లకు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 11.29 శాతం వృద్ధిచెందాయి. అడ్వాన్సులు 11.34 శాతం పెరుగుదలతో రూ.9.6 లక్షల కోట్ల వద్ద నిలిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్సులు 10 శాతం, డిపాజిట్లు 9 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు బ్యాంక్ ఎండీ తెలిపారు. కెనరా బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 5.35 శాతం నుంచి 4.23 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏలు 1.73 శాతం నుంచి 1.27 శాతానికి మెరుగుపడ్డాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 89.1 శాతం ఉన్నది.






