స్మోకింగ్‌కు నో చెప్పలేమా?
‘అలవాట్లే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి’ అని పెద్దలు చెప్తారు. అది అక్షరాల నిజం. మంచి అలవాట్లు అభివృద్ధికి తోడ్పడితే దురలవాట్లు వినా శనానికి దారి తీస్తాయి. రెండో కేటగిరీకి చెందిన హ్యాబిట్ ‘స్మోకింగ్’. నేటి యువత సరదాగా టీనేజ్‌లో పొగ తాగడానికి అలవాటు పడుతున్నారు. క్రమంగా దానికి బానిసలై ఆ ఊబిలో దిగబడిపోయి, బయటపడలేక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అది మనలను మృత్యువు వైపు తీసుకెళుతున్న సంగతి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా ‘పొగ తాగడానికి’ ఎందుకు గుడ్‌బై చెప్పలేక పోతు న్నారు? ‘వరల్డ్ నో టొబాకో డే’ సందర్భంగానైనా ‘స్మోకింగ్‌కు నో’ చెప్పాలని ఆశిద్దాం.
ధూమపానం వల్ల కలిగే నష్టంపై ఓ కవి రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. ‘సరదాగా మొదలై/ ధూమపానం/ పాడెదాకా శీఘ్రం గా/మోసుకెళ్లడం ఖాయం’. పొగాకు తీసుకోవడం వల్ల నికోటిన్ విడుదలై మనిషి కొంతసేపు మానసికంగా యాక్టివ్ అవుతారన్న సంగతిని ప్రతి ఒక్కరూ ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే తెలుసుకొని వుం టారు. అయినా, టీనేజీ వయసులో కాలేజీకి వచ్చేసరికి స్నేహితుల ప్రభావం వల్లో, మరో కారణంతోనో లేదా స్టయిల్‌గా కనబడటం కోసమో ఒక్క సిగరెట్‌తో మొదలై ధూమపాన ఊబిలో కూరుకు పోతుండడం బాధాకరం.
థియేటర్లలో, బహిరంగ ప్రదేశాల్లో ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని బోర్డులు మాత్రం ఘనంగానే కనిపిస్తాయి. సిగరెట్ పెట్టెలమీద భయంకరమైన ఫొటోలు కూడా వుంటాయి. కొత్త సిని మాల ప్రారంభంలో దీనివల్ల కలిగే నష్టాలపై వచ్చే భీకర ప్రకటనలు చూస్తుంటాం. అయినా, ప్రజలు పూర్తి స్థాయిలో చైతన్యవంతులు కావడం లేదు. ఇప్పటికైనా, అందరూ వాస్తవం గ్రహించాలి. పొగా కు వాడకం వల్ల మనిషి ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడి జీవితం నడిమధ్యలోనే ముగించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా నేటి తరం దీని పర్యవసానాన్ని అర్థం చేసుకొని ధూమపానానికి ఎంత త్వరగా దూరమైతే అంత మంచిది.
(మే 31 ‘ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం’)
-అంబీరు శ్రీకాంత్






