27 April, 2026 | 6:56 AM

జీహెచ్‌ఎంసీలోకి కంటోన్మెంట్ ఏరియా!

26-06-2024 01:25 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్  

కంటోన్మెంట్ బోర్డుల రద్దుపై కేంద్రం నిర్ణయం

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): కంటోన్మెంట్ ల పరిధిలో ఉన్న సివిల్ ప్రాంతాలను మునిసిపాలిటీలలో విలీనం చేసే విధి విధానాలపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఏ గిరిధర్ మంగళవారం వివిధ రాష్ర్ట ప్రభుత్వాల సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ర్ట సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

బ్రిటీష్ పాలన నుండి నేటి వరకు భారతదేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున కంటోన్మెంట్ ఏరియాలోని సివిల్ ప్రాంతాలను  మున్సిపాలిటీలలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వ అధికారులను గిరిధర్ కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే సమ్మతిని తెలిపిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం పట్టుదలతో ఉందని ఆమె తెలియజేశారు.  వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, మున్సిపల్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.