03-05-2025 08:51:25 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సర్కిల్ 14 సెక్షన్ ఆఫీసర్ నరేస్ పై దాడి చేశాడు. ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించి, తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ పై బీఎన్ఎస్ యాక్ట్ 132, 352 కింద అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ ముందే సెక్షన్ ఆఫీసర్ నరేష్ పై కార్పొరేటర్ దాడి చేయడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీవ్రంగా స్పందించారు. అధికారులపై దాడులు చేస్తే సహించబోమని కమిషనర్ కర్ణన్ హెచ్చరించారు. అధికారులను పిలిపించి ఉద్యోగిపై జరిగిన దాడిపై వివరాలు తెలుసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో కార్పొరేటర్ పై కేసు నమోదు చేశామని కమిషనర్ కి అబిడ్స్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. జీహెచ్ఎంసీ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అధికారులపై ఒక కార్పొరేటర్ ఎలా చేయి చేసుకుంటారని నిలదీశారు. కార్పొరేటర్ జైష్వాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.