calender_icon.png 3 December, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ అభ్యర్థిపై కేసుల ఆరోపణలు

03-12-2025 11:00:53 PM

-నేర చరిత్రను గోప్యంగా ఉంచాడని ఫిర్యాదు

-వివిధ పోలీసు స్టేషన్లలో పదికి పైగా నమోదైన కేసులు

-సెల్ఫ్ డిక్లరేషన్ లో పొందుపర్చని కేసుల వివరాలు

-నామినేషన్ ను తిరస్కరించాలని ఆధారాలతో అధికారులకు వినతి

-ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంపై అభ్యర్థుల ఆగ్రహం

వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ దశలో వెంకటాపూర్ మండలం ఉద్రిక్తంగా మారింది. ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన భాషబోయిన పోశాలు సర్పంచ్ అభ్యర్థిగా సమర్పించిన నామినేషన్ పత్రాలపై వివాదం చెలరేగింది. నేర చరిత్రను గోప్యంగా ఉంచి ఎన్నికల ప్రక్రియను తప్పుదోవ పట్టించాడని మిగతా సర్పంచ్ అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎన్నికల అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

నేర చరిత్రను దాచిపెట్టాడని ఆరోపణ

ఎన్నికల నియమాల ప్రకారం అభ్యర్థులు తమ స్థిర ఆస్తులు, పెండింగ్ కేసులు, నేర చరిత్ర వంటి వివరాలను సెల్ఫ్ అఫిడవిట్‌లో తప్పనిసరిగా పొందుపరచాలి. అయితే పోశాలు తన అఫిడవిట్‌లో పలు కేసులను ప్రస్తావించలేదని ఇతర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. రేగొండ, ఘనపూర్, హసన్‌పర్తి, కేయూ, ఎనమాముల పోలీస్ స్టేషన్లలో పోశాలుపై పదికి పైగా కేసులు నమోదై ఉండి, కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని వారు పేర్కొన్నారు.

ఆధారాలతో ఫిర్యాదు.. కానీ అధికారుల నిర్లక్ష్యం

పోశాలుకు సంబంధించిన కేసుల వివరాలను సాక్ష్యాధారాలతో కలిసి బుధవారం ఆర్వోకు సమర్పించినప్పటికీ అధికారుల వైఖరి నిర్లక్ష్యంగా ఉందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఇది పెద్ద నేరం కాదన్నట్లుగా వ్యవహరించడం ఎలా..? అని వారు ప్రశ్నించారు. నామినేషన్ పత్రాల్లో అసత్య సమాచారం ఇవ్వడం స్వయంగా ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని అభ్యర్థులు నిలదీశారు.

ఎంపిడిఓ, ఎస్సైలను పిలిపించి విచారణ చేయాల్సింది

ఆరోపణలు వచ్చిన సందర్భంలో మండల స్థాయి అధికారులు ముఖ్యంగా ఎంపిడిఓ, స్థానిక ఎస్సై సదరు అభ్యర్థి నేర చరిత్రను ధృవీకరించాల్సిందని అభ్యర్థులు పేర్కొన్నారు. అలా కాకుండా సరైన విచారణ లేకుండానే అధికారులే నిర్ణయాలు తీసుకోవడం సందేహాస్పదమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్వో చర్యలు తీసుకోకపోతే.. జిల్లా కలెక్టర్ దాకా వెళ్లే నిర్ణయం

ఆర్వో స్పందించకపోతే ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌ను కలవాలని, అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అభ్యర్థులు స్పష్టం చేశారు.

మండలంలో చర్చనీయాంశంగా మారిన వివాదం

ఈ ఘటనతో వెంకటాపూర్ మండల రాజకీయాల్లో నామినేషన్ దశలోనే తీవ్ర చర్చ సాగుతోంది. పలు కేసులు ఉన్న అభ్యర్థికి ఎన్నికల అధికారులు మద్దతు ఎందుకు చూపుతున్నారనే ప్రశ్న ఇప్పుడు మండలంలో చర్చనీయాంశమైంది.