14 March, 2026 | 8:44 PM

పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం

14-03-2026 05:42 PM

హనుమకొండ,(విజయక్రాంతి): పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమైన నేపథ్యంలో హనుమకొండలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హనుమకొండ లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హై స్కూల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కల్పించిన తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన పరిసరాలు,టాయిలెట్ వసతులు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.పరీక్షల నిర్వహణ దృష్ట్యా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కూడా పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీల సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.