పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో నిర్వహిస్తున్న పదవ తరగతి వార్షిక పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం పాల్వంచ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత బాలికల అభ్యుదయ పాఠశాల పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించబడుతున్నాయా అనే అంశాలను పరిశీలించి, పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలలో విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత బాలికల అభ్యుదయ పాఠశాలలో మొత్తం 210 మంది విద్యార్థులకు గాను 209 మంది హాజరుకాగా, ఒకరు గైహాజరయ్యారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 135 మంది విద్యార్థులకు గాను 131 మంది హాజరుకాగా, నలుగురు గైహాజరయ్యారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మొదటి రోజు 39 మంది గైరహాజర్
జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,740 మంది విద్యార్థులు నమోదు కాగా, వారిలో 12,701 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 39 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 12,720 మందికి గాను 12,687 మంది హాజరుకాగా, 33 మంది గైహాజరయ్యారు. అలాగే ప్రైవేట్ అభ్యర్థుల్లో 20 మందికి గాను 14 మంది హాజరుకాగా, 6 మంది గైహాజరయ్యారు.
జిల్లాలో మొత్తం హాజరు శాతం 99.74 శాతంగా నమోదైంది. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 (బి) అమలులో ఉందని, అనుమతి లేని వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పరీక్షలు సజావుగా నిర్వహించాలని తెలిపారు. ఈ తనిఖీలు కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




