30 March, 2026 | 3:12 PM

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

30-03-2026 01:44 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): ప్రస్తుత కాలంలో నేరాలను నియంత్రించడంలోనే కాకుండా, నేరస్థులను వేగంగా గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని  మెట్ పల్లి  డిఎస్పి రాములు తెలిపారు.కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇరవై ఆరవ వార్డులో కౌన్సిలర్ బొడ్ల రమేష్ అధ్వర్యం లో ఏర్పాటు చేసిన  14 సీసీ కెమెరాలను డీఎస్పీ ప్రారంభించారు.ఈ సందర్భంగా డిఎస్పి రాములు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పోలీసులకు ఒక శక్తివంతమైన ఆయుధంలా మారాయని పేర్కొన్నారు.

ఏదైనా నేరం జరిగినప్పుడు దానిలో పాల్గొన్న నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకంగా ఉపయోగపడుతుందని చెప్పారు.సీసీ కెమెరాలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ప్రజలకు నిరంతర భద్రతను అందిస్తాయని, నేరాలను తగ్గించడంలో మరియు అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని వివరించారు.ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి సీ.ఐ అనిల్, ఎస్.ఐ కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మైలారప్ లింబాద్రి వైస్ చైర్మన్ ఒంకార్ నవీన్, ప్రజలు పాల్గొన్నారు.