29-07-2025 02:11:11 AM
మిషన్ భగీరథ పైపులైన్ డ్యాజ్
నిత్యం ఎమ్మెల్యే వెళ్ళే రహదారి అయినా పట్టింపులేదు
సదాశివపేట, జూలై 28 : సదాశివపేట పట్టణంలో ఓ ప్రైవేట్ నెట్వర్క్ పేరుతో సీసీ రోడ్లను ఇష్టారీతిగా తవ్వకాలు చేపట్టడంతో గుంతలు ఏర్పడి వాహనదారులకు ప్రమాదాలు కలుగుతు న్నాయి. పట్టణంలోని గురునగర్ కాలనీ చౌరస్తాలోని మురికి కాలువపై సీసీ బెడ్ వేసి నెల రోజులు కూడా కాకముందే ప్రైవేట్ నెట్వర్క్ పేరుతో తవ్వకాలు చేసి ఇష్టారీతిన వదిలేశారు.
నడిరోడ్డుపై తవ్వకాలు జరిపి మట్టితో కప్పేయడం వల్ల అది కృంగిపోయి పలు వాహనాలు అందులో పడి నిత్యం ఆ రోడ్డుపై వెళ్తున్న వారికి ప్రమాదాలు కలుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా సోమవారం వాటర్ బాటిళ్ళను తీసుకెళ్ళే ఆటో ట్రాలీ ఈ గుంతలో పడి కూరుకుపోయింది. ఇలా ప్రతీరోజు ఏదో ఒక వాహనం ప్రమాదానికి గురవుతూనే ఉంది.
ప్రైవేట్ నెట్వర్క్ సిబ్బందికి అధికారులు ఇష్టారీతిగా అనుమతులు ఇచ్చి పర్యవేక్షణ చేయకపోవ డంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రతీరోజు ఈ దారిలోనే స్థానిక ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్ళే దారి అయినప్పటికీ దీనిపై స్పందించక పోవడం శోచనీయం.
ఈ గుంతల తవ్వకం వల్ల మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. దీంతో తాగు నీరు కలుషితం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని గుంతలను పూడ్చాలని, మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతు చేయాలని కోరుతున్నారు.