29-07-2025 02:09:21 AM
మూడో నోటీసుతో సరిపెట్టిన అధికారులు
విజయక్రాంతి కథనానికి స్పందన
కొండాపూర్, జూలై 28 : కొండాపూర్ మండలం మునిదేవునిపల్లిలో అధికారుల తీరు హాస్యాస్పదంగా ఉంది. అక్రమంగా శ్రీరిధి రఘునాథ్ డెవలపర్స్ నిర్వాహకులు అక్రమంగా ప్రహారీగోడను నిర్మించారని రైతులు, పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ కేవలం నోటీసులతోనే కాలయాపన చేస్తూ వారిపై ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదే విషయాన్ని విజయక్రాంతి సోమవారం కథనం ప్రచురించడంతో తూతూ మంత్రంగా చిన్నపాటి గోడను కూల్చివేసి మూడో నోటీసును నిర్వాహకులకు అందించడం విడ్డూరంగా ఉంది. మరోవైపు జిల్లా పంచాయతీ అధికారులు సైతం వెంచర్ నిర్వాహకులపై అమిత ప్రేమను కురిపించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
అక్రమార్కులపై ప్రేమ ఎందుకో ?
అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని 2024 అక్టోబర్లోనే ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా కొందరు అధికారులు అక్రమార్కులపై అతి ప్రేమను చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మునిదేవుని పల్లి, మాందాపూర్, మాచేపల్లి, గంగారం, కొండాపూర్, మన్సాన్పల్లి గ్రామాల రైతులు పొలాలకు వెళ్లకుండా ప్రభుత్వ స్థలంలో అడ్డుగోడ నిర్మించారు.
వాటిని తొలగించాలని జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దాదాపు సంవత్సరం పూర్తికావొచ్చిన మండల పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం. అయితే వరుసగా విజయక్రాంతి దినపత్రికలో కథనాలు రావడంతో రెండు నోటీసులు ఇచ్చి సోమవారం నామమాత్రంగా రైతులు వెళ్ళేందుకు వీలుగా గోడను కూల్చివేసి చేతులు దులుపుకున్నారు. మిగతా గోడను యజమానులే కూల్చివేయాలని చెప్పినట్లు ఎంపీవో తెలిపారు.
అక్రమాలు కొండంత...చర్యలు గోరంత
మునిదేవుని పల్లి గ్రామంలో గల శ్రీ రిధి రఘునాథ్ డెవలపర్స్ లో దాదాపు 15 ఎకరాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తే మండల పంచాయతీ అధికారులు నాలుగు ఇటుకలు తీసి అక్రమాలను కూల్చామని ఫోటో దిగి వెనుదిరిగారు. జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేసినా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని, ఇందులో జిల్లా అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఇలావుండగా ఎంపీవో శ్రీనివాస్ను వివరణ కోరగా రెండు, మూడురోజుల్లో వెంచర్ నిర్వాహకులు తొలగించకుంటే తామే కూల్చివేస్తామని తెలిపారు.
విజయక్రాంతి ఎఫెక్ట్..
కొండాపూర్ మండల పరిధిలోని మునిదేవునిపల్లి గ్రామంలో శ్రీనిధి శ్రీ రఘునాథ్ డెవలపర్స్ వెంచర్లో సర్వేనెంబర్ 194,196,16 లో ఎలాంటి పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మించిన భారీ ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు.
సోమవారం నోటీసులు ఇచ్చారు..చర్యలు మరిచారు అనే శీర్షికన విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కథానానికి ఎంపీవో శ్రీనివాస్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి కిశోర్ వెంచర్ వద్దకు వెళ్లి జెసిబి సహాయంతో తూతూ మంత్రంగా రెండు పిల్లర్ల మధ్య ఉన్న గోడను కూల్చివేశారు. అనంతరం మూడవ నోటీసును నిర్వాహకులకు అందజేశారు.