27 April, 2026 | 3:40 AM

గోదావరి పుష్కరాలు 2027కి భారీ ఏర్పాట్లు.. ఆలయాల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

10-03-2026 03:37 PM

హైదరాబాద్: గోదావరి పుష్కరాలు-2027పై(Godavari Pushkaralu) ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం మంగళవారం సచివాలయంలో పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన ప్రారంభమైంది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీర ఆలయాల అభివృద్ధి, ప్రధాన ఆలయాలను అనుసంధానిస్తూ రోడ్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అత్యంత వైభవంగా పుష్కరాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి భేటీకి అన్ని శాఖల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

2027లో తెలంగాణలో గోదావరి పుష్కరాలను నిర్వహించే అంశంపై పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి ఐదు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం శ్రీధర్ బాబు నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన క్యాబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏడుగురు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. గోదావరి నది పరిసర ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవసరమైనప్పుడు ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు ఆహ్వానిస్తామని కూడా పేర్కొంది. రెవెన్యూ (దేవాదాయ) శాఖ ప్రధాన కార్యదర్శి కమిటీ కన్వీనర్‌గా ఉంటారు. 


ఇవి కూడా చదవండి:

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్

హర్యానాలో రైతు ఇంట పెళ్లి.. రాహుల్ గాంధీ ప్రత్యేక హాజరు

యుద్ధం ముగింపు మా చేతుల్లోనే.. ఇరాన్ హెచ్చరిక