సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ
మంచిర్యాల, విజయక్రాంతి : పోలీస్ స్టేషన్ ను రామగుండం సిపి శ్రీనివాసులు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించి, పిటిషన్ లను వాటి రికార్డ్ లను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, కాలనీ, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్ఐ నేల్కి సుగుణాకర్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు పోలీస్ స్టేషన్ కి వెళ్తే సత్వర న్యాయం జరుగుతుంది అనే నమ్మకం, భరోసా కల్పించాలన్నారు.
బాధితుల పిర్యాదుల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్ లతో మర్యాదగా ప్రవర్తించాలి అన్నారు. బ్లూ కోట్స్ సిబ్బంది తో మాట్లాడి డయల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించి త్వరగా సంఘటన స్థలానికి చేరుకోవాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో రౌడీ షీటర్స్ కేడి లు, డిసి లు, సస్పెక్ట్ షీట్స్ ల ఇళ్లను, పాయింట్ బుక్స్ లను తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. సీపీ వెంట మంచిర్యాల ఏసిపి ప్రకాష్ , స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ , ఎస్ఐ సుగణాకర్ ఉన్నారు.






