పరామర్శకు వెళ్తూ అనంత లోకాలకు..
మఠంపల్లి, జూన్ 25: బైక్ పై ప్రయాణిస్తూ గేదెను ఢీకొనడంతో సిమెంట్ పరిశ్రమ కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మండల ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా క్రోసురు మండలంలోని పీసపాడు గ్రామానికి చెందిన కంచేటి శ్రీనివాస్(39) మండలంలోని గ్రామంలోని సాగర్ సిమెంట్ పరిశ్రమలో గత 13 ఏళ్ల నుండి ట్రాకింగ్ సెక్షన్ లోని లోడింగ్ సూపర్వైజర్ గా విధులు నిర్వర్తిసున్నాడని తెలిపారు.
తన అత్తగారికి ఆరోగ్యం బాగా లేనందున త్వరగా డ్యూటీని ముగించుకొని ఆమెను పరామర్శించడానికి ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో సుల్తాన్ పూర్ గ్రామం వద్ద సుమారు ఉదయం 6 గంటల సమయంలో ఆకస్మాత్తుగా రోడ్డు మీదకు గేదె అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రాళ్ళ మధ్యలో పడితలకు బలమైన గాయాలు కావడం వలన అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.జరిగిన ప్రమాదం సంఘటన గురించి మృతుడు కుటుంబానికి తెలుపడంతో అతని భార్య సుకన్య సంఘటన స్థలానికి చేరుకొని తన భర్త మృత దేహాన్ని గుర్తించారని చెప్పారు.ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.






